అయ్యో ‘మెహబూబా’ ఎంత పనైంది?       2018-05-10   00:05:12  IST  Raghu V

తన కొడుకు ఆకాష్‌ పూరిని పూర్తి స్థాయి హీరోగా పరిచయం చేసేందుకు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ తెరకెక్కించిన చిత్రం ‘మెహబూబా’. ఇండియా, పాకిస్తాన్‌ బోర్డర్‌లో జరిగే ఒక ప్రేమ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. దాంతో పాటు ఈ చిత్రం పూర్వ జన్మల కథతో కూడా ముడి పడి ఉందని, మగధీరకు ఈ చిత్రంకు సంబంధం ఉందని, రెండు కథలు సేమ్‌ టు సేమ్‌ ఉంటాయనే టాక్‌ వినిపిస్తుంది. సినిమా విడుదలకు ముందే పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది. భారీ ఎత్తున ప్రమోషన్‌ చేయడంతో పాటు, టీజర్‌ మరియు ట్రైలర్‌లు సినిమా స్థాయిని పెంచేశాయి. అంతా బాగున్నా విడుదలకు ముందు ఈ చిత్రంకు పెద్ద తలనొప్పి ఎదురైంది.

‘మెహబూబా’ చిత్రాన్ని ఈనెల 11న విడుదల చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే ఇప్పుడు విడుదల తేదీని మార్చితే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాని ఒక్క రోజే ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయక తప్పడం లేదు. తాజాగా విడుదలైన ‘మహానటి’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ను దక్కించుకుంది. రికార్డు స్థాయిలో రేటింగ్‌ను రాబట్టిన ఈ చిత్రంకు అన్ని వర్గాల నుండి నిరాజనాలు అందుతున్నాయి. మహానటి గురించి తెలుసుకునేందుకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా కూడా థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు.

ఇలాంటి సమయంలో ‘మెహబూబా’ వస్తే చూసేవారు ఎవరు ఉంటారు అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహానటి జోరు ముందు మెహబూబా నిలవలేదని, ఒక వేళ ఫలితం తారు మారు అయితే మినిమం కలెక్షన్స్‌ కూడా రావనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మహానటి విడుదలైన మూడవ రోజే మెహబూబాను విడుదల చేయడం అనేది సాహస నిర్ణయం. కాని పూరికి ప్రస్తుతం వెనక్కు తగ్గే అవకాశం లేదు. అన్ని విధాలుగా సినిమా విడుదల ఆపేందుకు దారులు మూసుకు పోయాయి. దాంతో సినిమాను విడుదల చేయక తప్పని పరిస్థితి.

‘మహానటి’ చిత్రం కోసం భారీ ఎత్తున థియేటర్లను తీసుకున్నారు. మూడవ రోజు మహానటిని తొలగించి మెహబూబా వేసుకోవాలని ఎక్కువ మంది అనుకున్నారు. కాని మెహబూబా కంటే మహానటికే సదరు థియేటర్ల వారు ప్రాముఖ్యత ఇస్తున్నారు. దాంతో మెహబూబాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించడం కష్టమే. ఇక మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రం కూడా ఇంకా మంచి కలెక్షన్స్‌తో దూసుకు పోతుంది. ఈ నేపథ్యంలో మెహబూబా చిత్రం విడుదలైతే చాలా ఇబ్బందని, పూరి సినిమా మద్యలో ఇరుకుని పోయిందనే టాక్‌ వినిపిస్తుంది.