బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌     2017-01-18   00:48:14  IST  Bhanu C

తెలుగుదేశం నేత‌లు, మంత్రులు అంద‌రూ ఎదురుచూస్తున్న త‌రుణం ఎట్ట‌కేల‌కు రాబోతోంది. సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ త్వ‌ర‌లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నారు. ఇప్ప‌టివ‌రకూ తెర వెనుకే ఉన్న లోకేష్‌.. ఇప్పుడు ఎమ్మెల్సీ కాబోతున్నారు. అంతేగాక బాబు కేబినెట్‌లోకి ప్ర‌వేశిస్తున్నారు. దీంతో పాటు రెండు కీల‌క‌మైన శాఖ‌లు కూడా ఫిక్స్ అయిపోయాయి.

లోకేశ్‌ త్వరలో ప్రజా ప్రతినిధి కానున్నారు! మార్చి లేదా ఏప్రిల్‌ నెలల్లో జరిగే శాసనమండలి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవ‌బోతున్న‌ట్లు సమాచారం. రాష్ట్రంలో త్వరలో 22 ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఎమ్మెల్యేల కోటా నుంచి ఏడు సీట్లకు ఎన్నిక జరగనుంది. ప్రస్తుత సంఖ్యాబలాన్ని బట్టి ఇందులో పాలక టీడీపీకి ఆరు, వైసీపీకి ఒకటి లభించే అవకాశముంది. ఎమ్మెల్యేల కోటా నుంచే లోకేష్‌ ఎన్నికవుతారని స‌మాచారం.

లోకేష్‌ను చ‌ట్ట‌స‌భ‌ల్లోకి పంప‌డంపై పార్టీలో చర్చ జ‌రుగుతోంది. ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయ పడ్డారు. దీనికి ఎవరితోనైనా రాజీనామా చేయించాల్సి ఉంటుంది. లోకేష్‌ కోసం ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఉప ఎన్నిక జరపడం సరైన సంప్రదాయం కాదని కొందరు అభిప్రాయపడ్డారు. దాని బదులు ఎమ్మెల్సీగా చట్ట సభలోకి తీసుకురావడం మంచిదని, తర్వాత‌ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబెట్టవచ్చని సూచించ‌గా బాబు అందుకు అంగీక‌రించారు.

ఎమ్మెల్సీగా ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డ‌మే కాక ఈసారి మంత్రివర్గ విస్తరణలో లోకేష్‌కు చోటు కల్పించబోతున్నారట‌. మంత్రి వర్గంలోకి చేరడానికి ముందో.. చేరిన ఆరు నెలలలోపో ఆయన ఏదో ఒక చట్టసభలో సభ్యుడు కావాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రానికి కీల‌క‌మైన టెక్నాల‌జీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌లు అప్ప‌గించే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.