నువ్వు భయపడుతున్నావ్ బాబూ..! ఆ కుర్చీ బాలయ్య కి ఇచ్చేయ్ !       2018-06-13   22:17:02  IST  Bhanu C

వైసీపీ అధినేత జగన్ కి వస్తున్న ప్రజా స్పందనను చూసి తట్టుకోలేని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ పై మాట్లాడుతున్నాడని,ఆయనకు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని.. తాను ఓడిపోతానని అనుకున్నప్పుడల్లా ఈవీఎంల ట్యాంపరింగ్ పై చర్చ లేపుతున్నాడని దివంగత ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఈవీఎంలతోనే చంద్రబాబు గెలిచారా అని లక్ష్మీపార్వతి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఈవీఎంల ద్వారా గెలిస్తేనేమో నిజాయితీ – వేరే వాళ్లు గెలిస్తే మాత్రం అక్రమం అవుతుందా అంటూ ఆమె ప్రశ్నించారు.

సొంత సర్వేల్లోనూ టీడీపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో చంద్రబాబు ఇలాంటి అరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లలో చంద్రబాబు అన్ని వర్గాలకు మోసం చేసి రూ. 4 లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. అన్నింటిలో కూడా ఈ ప్రభుత్వం అవినీతిమయం అయ్యిందని జాతీయ సర్వేలే చెబుతున్నాయని గుర్తు చేశారు. టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు నేర చరిత్ర కలిగి ఉన్నారని జాతీయ మీడియా సర్వేలు చెబుతున్నాయని చెప్పారు. సొంత సర్వేల్లోనూ టీడీపీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.

ఈవీఎంలను దొంగతనం చేసిన వారికి చంద్రబాబు ఐటీ సలహాదారుడి పోస్ట్ ఇచ్చారని ఆమె విమర్శించారు. ట్యాంపరింగ్ జరగడానికి అవకాశం లేదని ఎన్నికల కమీషన్ స్పష్టంగా చెప్పినా.. మళ్లీ చంద్రబాబు అదే విషయాన్ని మాట్లాడుతన్నారని తెలిపారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలా చేయాలో తెలిసిన దొంగలు చంద్రబాబు నాయుడు పక్కన వున్నారని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ట్యాంపరింగ్ చేస్తాడనే భయం తమకు ఉందని..దీనిపై ఎన్నికల సంఘానికి తామే ఫిర్యాదు చేస్తామని లక్ష్మీపార్వతి వివరించారు. ఇటీవల మోత్కుపల్లి పోసాని కృష్ణమురళీ కూడా చంద్రబాబును విమర్శించారని జెండా నీది కానప్పుడు ఎందుకు మోసం చేస్తున్నావని వారు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.