రాజమౌళికి సాధ్యం కానిది సాధిస్తానంటున్న క్రిష్‌       2018-05-11   23:50:22  IST  Raghu V

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడికి సాధ్యం కాని, అసాధ్యం అయిన రికార్డులను జక్కన్న సాధించాడు. బాలీవుడ్‌ దర్శకులు సైతం జక్కన్నను చూసి ముక్కున వేలేసుకునేలా చేశాడు. అంతటి గొప్ప కీర్తిని రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంతో పొందిన విషయం తెల్సిందే. బాహుబలి చిత్రం బాలీవుడ్‌ చిత్రాలను సైతం తలదన్నేలా వసూళ్లు సాధించి హాలీవుడ్‌ సినిమాలకు సైతం పోటీగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి బాహుబలి సాధించలేని ఒక రికార్డును క్రిష్‌ సాధిస్తాను అంటూ నమ్మకంగా ఉన్నాడు. ఈ విషయాన్ని సన్నిహితులతో చెబుతున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం క్రిష్‌ బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌తో ‘మణికర్ణిక’ చిత్రంను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. జానపద చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను క్రిష్‌ ఎంతో కష్టపడి తెరకెక్కిస్తున్నాడు. క్రిష్‌ గత చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే మణికర్ణికకు దర్శకత్వం వహించే అవకాశం క్రిష్‌కు దక్కింది. కంగనా రనౌత్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి మరీ నటిస్తుంది. ఇది మరో బాహుబలి అంటూ కొందరు బాలీవుడ్‌ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి చిత్రంలో మాదిరిగా భారీ సెట్టింగ్‌లు మరియు యుద్ద సన్నివేశాలతో సినిమా నిండి ఉంటుందని అంటున్నారు.

‘మణికర్ణిక’ ప్రస్తుతం చివరి దశలో ఉంది. త్వరలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియా మొత్తంలో పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ సినిమాను చైనాలో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 10 వేల థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈమద్య భారతీయ సినిమాలు చైనాలో భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఆ ఇన్సిపిరేషన్‌తోనే మణికర్ణిక ను అక్కడకు తీసుకు వెళ్తున్నారు. ఈ విషయంలోనే రాజమౌళిపై క్రిష్‌ పై చేయి సాధించాలని భావిస్తున్నాడు.

బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుని కలెక్షన్స్‌ రాబట్టింది. కాని చైనాలో మాత్రం రెండు పార్ట్‌లకు తీవ్ర పరాభవం తప్పలేదు. రెండు పార్ట్‌లు కూడా చైనా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. విడుదలకు అయిన ఖర్చును కూడా బాహుబలి రాబట్టలేక ఢీలా పడిపోయింది. చైనాలో రాజమౌళికి తీవ్ర పరాభవం తప్పలేదు. అయితే జక్కన్న ఫ్లాప్‌ అయిన చోట తాను విజయ పతాకం ఎగుర వేయాలని క్రిష్‌ ఆరాట పడుతున్నాడు. చైనా ప్రేక్షకులు తమ సినిమాను తప్పకుండా ఆధరిస్తారనే నమ్మకంతో క్రిష్‌ ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.