మేం చెప్పిందే, బాలయ్య ప్రకటించాడు       2018-05-27   23:39:08  IST  Raghu V

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ మొదలు పెట్టిన ‘ఎన్టీఆర్‌’ చిత్రంపై నీలి నీడలు కమ్ముకున్న సమయంలో అనూహ్యంగా క్రిష్‌ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఆ విషయమై బాలయ్య క్లారిటీ ఇస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తాడని తేల్చి చెప్పాడు. తేజ ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్న సమయంలోనే తెలుగు స్టాప్‌ ఈ చిత్రానికి న్యాయం చేయగల సత్తా కేవలం క్రిష్‌కు మాత్రమే ఉందని, ఆయన్ను బాలయ్య ఒప్పిస్తే, సినిమా సగం సక్సెస్‌ అయినట్లే అంటూ కొన్ని రోజుల క్రితం కథనం రాయడం జరిగింది, ఇప్పుడు అదే జరిగింది.

మేం చెప్పినట్లుగానే క్రిష్‌ను ఒప్పించడంతో ‘ఎన్టీఆర్‌’ సినిమాకు బాలయ్య సగం సక్సెస్‌ అప్పుడే పొందాడు. బాలీవుడ్‌లో ‘మణికర్ణిక’ చిత్రాన్ని తెరకెక్కించిన క్రిష్‌ ప్రస్తుతం ఆ సినిమా నిర్మాణానంతర కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. మరో రెండు మూడు నెలల వరకు క్రిష్‌ ఆ పనితోనే ఉంటాడు. అందుకే ఎన్టీఆర్‌ సినిమాకు కాస్త సమయం కావాలని బాలయ్యను రిక్వెస్ట్‌ చేయడం, బాలయ్య వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిపోయిందట. బాలయ్య ఏరి కోరి క్రిష్‌ను ఎంపిక చేసుకున్నాడు కనుక ఆయన ఎప్పుడు అంటే అప్పుడే సినిమా చేయాల్సి ఉంటుంది.

బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని తెరకెక్కించిన క్రిష్‌ తెలుగు మరియు హిందీల్లో మంచి క్రేజ్‌ను కలిగి ఉన్నాడు. ఆయన క్రేజ్‌ ‘ఎన్టీఆర్‌’ సినిమాకు ఖచ్చితంగా హెల్ప్‌ అవుతుందని నందమూరి ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఆటోబయోపిక్‌ సినిమాలు తీయడం రెగ్యులర్‌ కమర్షియల్‌ తీసినంత ఈజీ కాదు. బయోపిక్‌ చిత్రాలను సహజంగా చూపించడంతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉండాలి. అందుకే బయోపిక్‌లకు అనుభవం ఉన్న దర్శకు కావాలి.

క్రిష్‌ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌’ సినిమా అంటే చాలా నమ్మకం ఉంటుంది. అయితే బాలయ్య స్క్రిప్ట్‌ విషయంలో ఏమైనా వేలు పెడుతాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్‌ జీవితంలో మంచితో పాటు కాస్త చెడు కూడా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా చూపించినప్పుడు మాత్రమే సినిమాకు సంపూర్ణత్వం వస్తుంది. అలా కాకుండా నాణెంకు ఒక్కవైపు ఉన్నది చూపిస్తే ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. మరి క్రిష్‌ ఏం చేస్తాడో చూడాలి. 2019 వేసవిలో సినిమా విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. అతి త్వరలోనే బాలయ్య కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత ‘ఎన్టీఆర్‌’ సినిమా ఉంటుందని సినీవర్గాల వారు చెబుతున్నారు.