తెలుగులో దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా, తదితర పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు” గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు కోట శ్రీనివాస రావు తాజాగా మరో ప్రముఖ సీనియర్ నటుడు బాబు మోహన్ తో కలిసి టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ మరియు హీరో అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “ఆలీతో సరదాగా” అనే కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు.
ఇందులో భాగంగా తమ సినీ జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.దీంతో ఈ షో నిర్వాహకులు వచ్చే మంగళవారం రోజున ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోని యూట్యూబ్ లో విడుదల చేసారు.
అయితే ఇందులో భాగంగా కోట శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కొడుకు “కోట వెంకట ఆంజనేయ ప్రసాద్” ని గుర్తు చేసుకుని కొంతమెర ఎమోషనల్ అయ్యాడు.అనంతరం బాబు మోహన్ తో కలిసి నటించిన చిత్రాల గుర్తు చేసుకుంటూ పలు ఆసక్తికర అంశాలను తెలియజేశారు.
ఇక బాబు మోహన్ విషయానికొస్తే ప్రముఖ స్వర్గీయ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ని ఎంతో వినయంగా, విధేయతతో ఇంటర్వ్యూ చేసినందుకుగాను ఆలీ ని అభినందించాడు. అంతేగాక తాను ఆ ఇంటర్వ్యూ కన్నార్పకుండా చూశానని కూడా చెప్పుకొచ్చాడు.
అయితే కోట శ్రీనివాస రావు తనకి ఎక్కడో ఆవ గింజంత అదృష్టం ఉందని అందుకే ఇప్పటి వరకు సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నానని చెబుతూ అందరిని సరదాగా నవ్వించాడు.అంతేగాక ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెతను చెబుతూ బంగారం ఎప్పుడూ కూడా పాతది కాదని అలాగే దానిని ఎంత మెరుగు పరిస్తే అంత మెరుస్తుందని యువ నటీనటులకు సూచించాడు.ఐతే ఈ షో గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే వచ్చే మంగళవారం వరకూ ఆగాల్సిందే…
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బాబు మోహన్ అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బాగానే బిజీ బిజీగా గడుపుతున్నాడు.ఇక కోట శ్రీనివాస రావు విషయానికి వస్తే ప్రస్తుతం వయసు మీద పడడంతో కొంత మేర సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.కానీ ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూలలో తనకు ఇంకా నటించాలనే కోరిక ఉన్నప్పటికీ తన వయసు, శరీరం రెండూ సహకరించక పోవడం వల్లే తాను సినిమాలకి దూరంగా ఉంటున్నానని పలు సందర్భాలలో నటుడు కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు. ఏదేమైనప్పటికీ ఈ ఇద్దరి పెయిర్ మాత్రం అప్పట్లో సూపర్ హిట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికీ ఈ ఇద్దరు నటించినటువంటి కామెడీ సన్నివేశాలను చూస్తే నవ్వు ఆపుకోలేరు.