నానితో సినిమా ఉత్తి మాటలే!       2018-05-21   22:47:12  IST  Raghu V

చేసిన అన్ని సినిమాలను బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ు చేసుకున్న దర్శకుడు కొరటాల శివ తాజాగా ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్‌బాబును సీఎంగా చూపించిన కొరటాల ఆ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను సాధించాడు. చేసిన నాలుగు సినిమాల్లో మూడు ఇండస్ట్రీ టాప్‌ చిత్రాల జాబితాలో ఉన్నాయి అంటే కొరటాల శివ స్థాయి ఏంటీ, ఆయనకు ప్రస్తుతం ఉన్న క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ స్థాయిలో అంచనాలున్న నేపథ్యంలో కొరటాల తర్వాత సినిమా ఏంటా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భరత్‌ చిత్రం తర్వాత కొరటాల చేయబోతున్న సినిమాపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

భరత్‌ అనే నేను చిత్రం విడుదలైన వెంటనే అఖిల్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అక్కినేని ఫ్యామిలీ భారీ మొత్తాని కొరటాల శివకు ఇవ్వబోతున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. కాని అవి పుకార్లే అంటూ అక్కినేని వారు తేల్చి పారేశారు. ఆ తర్వాత నాని హీరోగా కొరటాల శివ సినిమా ప్లాన్‌ చేశాడని కాస్త గట్టిగానే ఈ పుకార్లు షికార్లు చేశాయి. కాని దర్శకుడు కొరటాల శివ సన్నిహితులు ఆ వార్తలను కూడా కొట్టి పారేశారు. నానితో సినిమా గురించి కొరటాల అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు చెబుతున్నారు.

ఇక ఇప్పుడు కొరటాల తర్వాత సినిమా గురించి మరో ఆసక్తికర చర్చ జరుగుతుంది. కొరటాల శివకు చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక చాలా కాలంగా ఉంది. ఆ కోరికతో రెండు స్క్రిప్ట్‌లను కూడా చిరంజీవి కోసం సిద్దం చేశాడు. అందులో ఒక స్టోరీ లైన్‌ చిరంజీవికి బాగా నచ్చడంతో త్వరలోనే వీరి కాంబో మూవీ వర్కౌట్‌ కాబోతుందని సమాచారం అందుతుంది. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది సైరా విడుదల కాబోతుంది.

సైరా విడుదలకు ముందే లేదా విడుదలైన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. మెగా క్యాంపులో చాలా కాలం క్రితమే కొరటాల శివ సినిమా చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. రామ్‌ చరణ్‌తో కూడా కొరటాల ఒక సినిమా చేస్తాడనే టాక్‌ వస్తుంది. అయితే రాజమౌళి సినిమాకు రామ్‌ చరణ్‌ కమిట్‌ అయిన కారణంగా వీరిద్దరి కాంబో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈలోపుగా చిరంజీవితో కొరటాల శివ సినిమా ముగించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో చిరంజీవి, కొరటాల శివల మూవీ ప్రారంభం కాబోతుంది. అల్లు అరవింద్‌ ఆ సినిమాను నిర్మిస్తాడనే టాక్‌ వినిపిస్తుంది.