కన్ఫ్యూజ్‌ చేయకు కొరటాల.. మళ్లీ సైరా ఏంటీ?       2018-05-08   06:07:03  IST  Raghu V

‘మిర్చి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన కొరటాల శివ ఆ తర్వాత వరుసగా భారీ విజయాలను దక్కించుకుంటూ వస్తున్నాడు. చేసిన ప్రతి సినిమా కూడా రికార్డు స్థాయి విజయాలను దక్కించుకుంది. దాంతో ఈయన దర్శకత్వంలో సినిమాకు సూపర్‌ స్టార్స్‌, మెగాస్టార్స్‌ కూడా ఆసక్తి చూపుతున్నారు. భరత్‌ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌ టాప్‌ 3 చిత్రంను మహేష్‌బాబుకు అందించిన కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్‌తో తీయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదని మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. దాంతో మళ్లీ కొరటాల సినిమా ఎవరితో అంటూ చర్చ మొదలైంది.

తాజాగా సోషల్‌ మీడియాలో కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. నాగార్జున ఏరి కోరి మరీ కొరటాలతో అఖిల్‌ సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయినట్లుగా వార్తలు వచ్చాయి. భారీ పారితోషికం ఇచ్చి మరీ కొరటాలను అక్కినేని నాగార్జున బుక్‌ చేయడం జరిగిందని పుకార్లు షికార్లు చేశాయి. ప్రస్తుతం అఖిల్‌ చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే కొరటాల మూవీ ప్రారంభం అవుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ వార్తలు కూడా నిజం కాదని, అక్కినేని హీరోతో కొరటాల శివ మూవీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

కొరటాల శివ గురించి మరో వార్త చక్కర్లు కొడుతోంది. భరత్‌ అనే నేను చిత్రం తర్వాత చిరంజీవి హీరోగా ఒక చిత్రాన్ని చేయాలని కొరటాల నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చిరంజీవి చేస్తున్న విషయం తెల్సిందే. చిరంజీవితో సినిమా చేయాలని అందరు దర్శకులు కోరుకుంటారు. అందరితో పాటు కొరటాల కూడా చిరంజీవితో ఒక చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఒక మంచి కథను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ కథను చిరంజీవికి వినిపిస్తాడని, ఖచ్చితంగా కొరటాలకు చిరంజీవి సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం పూర్తి అయ్యేందుకు ఇంకా ఆరు నెలలకు అదనంగానే పట్టే అవకాశం ఉంది. మరి ఈ ఆరు నెలలు కొరటాల శివ ఖాళీగా ఉంటాడా లేదా సైరాకు సమాంతరంగా చిరంజీవితో సినిమాను ప్లాన్‌ చేస్తాడా లేదంటూ ఈ గ్యాప్‌లో ఒక చిన్న చిత్రాన్ని చుట్టేస్తాడా అనేది చూడాలి. మొత్తానికి చిరంజీవితో సినిమా అంటూ కొరటాల శివ అందరిని కన్ఫ్యూజన్‌లోకి నెట్టాడు. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే ఆయన స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సిందే.