గ‌ద్దె రామ్మోహ‌న్ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు..!       2018-05-20   00:21:36  IST  Bhanu C

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో రాజ‌ధాని ప్రాంతం విజ‌య‌వాడలో అధికార టీడీపీలో టికెట్ల కుమ్మ‌లాట‌లు రోడ్డున ప‌డే ప‌రిస్థితి వ‌స్తోంది. అత్యంత కీల‌క‌మైన విజ‌య‌వాడ‌లో మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో ప్ర‌ధానంగా క‌మ్మ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న‌ది తూర్పులో మాత్ర‌మే. అంతేకాదు, ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌ధాన రోడ్ల‌కు `నారా చంద్ర‌బాబు నాయుడు` రోడ్డుగా నామ‌క‌ర‌ణం చేసుకున్నారు. అదేవిధంగా అతిపెద్ద పార్కుకు కూడా ఆయ‌న పేరే పెట్టుకున్నారంటే.,. ఇక్క‌డ టీడీపీ బ‌లం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌ని లేదు.

గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన గ‌ద్దె రామ్మోహ‌న్‌.. అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. రాజ‌కీయంగా కీల‌కం కావ‌డం, వ్యాపార ప‌రంగాను ముఖ్యం కావ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంపై అంద‌రి దృష్టీ ప‌డింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ త‌ర‌పున ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని భావించిన మాజీ ఎమ్మెల్యే.. య‌ల‌మంచిలి ర‌వి.. ఈ విష‌యంపై నేరుగా అధినేత చంద్ర‌బాబునే ప్ర‌శ్నించారు. అయితే, టికెట్లు, సీట్ల విష‌యంలో స‌ర్వేలు చేయించిన చంద్ర బాబు.. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుత ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ బ‌లంగా ఉన్నాడ‌ని గుర్తించి.. ఆయ‌నకే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇదే విష‌యాన్ని య‌ల‌మంచిలి ర‌వికి చెప్ప‌డంతో ఆయ‌న టీడీపీకి రాంరాం చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీకి తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో త‌ల‌నొప్పి వ‌దిలింద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆ పార్టీ నుంచి మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చాడు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్‌గా ఉన్న కోనేరు శ్రీధ‌ర్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు.. పార్టీలో ముఖ్యంగా తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ముస‌లం పుట్టడం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. తాజాగా కోనేరు మాట్లాడుతూ… వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నాన‌ని వెల్ల‌డించాడు.

అంతేకాదు, ఈ విష‌యంలో రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణ‌యం ఏమీ లేద‌ని, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే తాను ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు దృష్టికి తెచ్చాన‌ని, అయితే, ఆయ‌న 2019లో ఇస్తాన‌ని హామీ కూడా ఇచ్చార‌ని మేయ‌ర్ చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయాల‌ని ఆయ‌న కోరారు. కాగా, తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికే చెందిన శ్రీధ‌ర్‌.. స్థానికంగా మంచి ప‌ట్టున్న నాయ‌కుడు. అయితే, బాగా వెనుకేసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా.. ఇప్పుడు ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న పార్టీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.