టాలీవుడ్‌ను చూసి ఏడుస్తున్నారా..!     2017-01-18   22:14:19  IST  Raghu V

ఒక‌ప్పుడు తెలుగు సినిమా మార్కెట్ అంటే కేవ‌లం తెలుగు రాష్ట్రం వ‌ర‌కే ఉండేది. ఆ త‌ర్వాత అది క్ర‌మ క్ర‌మంగా క‌ర్ణాట‌క‌ను ఆక్ర‌మించింది. క‌ర్ణాట‌క‌లో పెద్ద తెలుగు సినిమా మార్కెట్ రూ.10 వ‌ర‌కు ఏర్ప‌డింది. త‌ర్వాత అది త‌మిళ్‌, ఒడిస్సా, రెస్టాఫ్ ఇండియా వైపు విస్త‌రించింది. ఇక ఓవ‌ర్సీస్ అయితే ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్‌కు అక్ష‌య‌పాత్ర‌గా మారిపోయింది.

ఓవ‌ర్సీస్‌లో తెలుగు సినిమా మార్కెట్ ఎలా విస్త‌రించింది అంటే…తెలుగు సినిమా పెద్ద మార్కెట్ ప్రాంత‌మైన నైజాంతో స‌మానంగా అక్క‌డ తెలుగు సినిమా మార్కెట్ ప‌రిధి పెరిగింది. నైజాంతో స‌మానంగా మ‌న సినిమాకు ఓవ‌ర్సీస్‌లో మార్కెట్ విస్త‌రించ‌డం అంటే చాలా గొప్ప విష‌య‌మే. ఓవ‌ర్సీస్‌లో మ‌హేష్‌బాబు సినిమాల‌తో మొద‌లైన ఊపు ఇప్పుడు మిగిలిన అంద‌రు హీరోల సినిమాల‌కు విస్త‌రించింది.

అక్క‌డ మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ అనేది తెలుగు హీరోల క‌ల‌. ఇప్పుడు ఖైదీ, శాత‌క‌ర్ణి సినిమాల‌తో సీనియ‌ర్ హీరోలు చిరు, బాల‌య్య సైతం అక్క‌డ మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ దాటేశారు. ఇక ఎప్ప‌టి నుంచో అక్క‌డ మిలియ‌న్ మార్క్ కోసం కుస్తీ ప‌డుతోన్న చెర్రీ సైతం ధృవ సినిమాతో ఆ మార్క్‌ను చేరుకున్నాడు.

అయితే అక్క‌డ తెలుగు సినిమాకు వ‌స్తోన్న క్రేజ్ చూసి మిగిలిన భాష‌ల హీరోలు కుళ్లుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. అక్క‌డ మ‌న సినిమాల‌కు ఉన్న క్రేజ్ ముఖ్యంగా త‌మిళ సినిమాల‌కు అక్క‌డ అస్స‌లు మార్కెట్ లేదు. ఇక్క‌డ రూ.100 కోట్లు సాధించిన సినిమా కూడా అక్క‌డ ప్లాప్ అవుతోంది. ఉదాహ‌ర‌ణ‌కు ఈ సంక్రాంతికి మ‌న ఖైదీ అక్క‌డ 2 మిలియ‌న్ డాల‌ర్లు, శాత‌క‌ర్ణి 1.4 డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌డితే …విజ‌య్ న‌టించిన భైర‌వ యావ‌రేజ్ టాక్‌తో కూడా కోలీవుడ్‌లో మంచి వ‌సూళ్లు సాధిస్తోంది. కాని ఇదే సినిమా ఓవ‌ర్సీస్‌లో పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది.

ఒక్క ఓవ‌ర్సీస్‌లో త‌మిళ హీరోల్లో ర‌జ‌నీకాంత్‌కు మాత్ర‌మే అక్క‌డ సూప‌ర్ మార్కెట్ ఉంది. ఇక బాలీవుడ్‌లో ఖాన్ హీరోల‌కు మిన‌హాయిస్తే మిగిలిన హీరోల‌కు సైతం అక్క‌డ మ‌న తెలుగు సినిమాల స్థాయిలో మార్కెట్ లేదు. ఏదేమైనా యూఎస్‌లో తెలుగు సినిమాల‌కు వ‌స్తోన్న వ‌సూళ్లు చూసి ఇటు కోలీవుడ్‌, అటు బాలీవుడ్ హీరోలు కాస్త కుళ్లుకుంటున్నార‌న్న చ‌ర్చ‌లు విన‌వ‌స్తున్నాయి. ఇది చూసి మ‌నం గ‌ర్వించుకోవాల్సిందే.