గుడివాడలో కొడాలి నాని మళ్ళీ గెలవబోతున్నాడా ..?       2018-05-23   23:02:14  IST  Bhanu C

రాష్ట్రంలో గుడివాడ నియోజకవర్గానికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం ఇది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కి కంచుకోటగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురుతోంది. దీనికి కారణం ఒకే ఒక్కడు అతడే కొడాలి వెంకటేశ్వరరావు ( నాని). ఇప్పుడు గుడివాడ అంటే నాని పేరే అందరికి గుర్తొస్తోంది. అంతగా ఈ నియోజకవర్గంపై ఆయన పట్టు సాధించాడు.

కొడాలి నాని తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ.. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే కాకుండా , పార్టీ అధికారంలో లేకపోయినా అభివృద్దిలో మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను తలదన్నేలా గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయి.
2019 ఎన్నికల్లో టీడీపీ ఎంత కష్టపడినా .. చివరకు గెలుపొందేది మాత్రం కొడాలి నాని నే అని అక్కడి ప్రజలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

నాపై పోటీ చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా ప్రయోజనం ఉండదని , నేను ఇక్కడ ఖచ్చితంగా గెలుపొందుతానని నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మాత్రం ఇక్కడ కొడాలిని ఎలాగైనా మట్టికరిపించాలని చూస్తోంది. అందుకు బలమైన అభ్యర్ధుల లిస్టు తయారు చేసుకుంది. టీడీపీ అభ్యర్థులుగా రావి వెంకటేశ్వరరావు, యలవర్తి శ్రీనివాసరావు, పిన్నమనేని బాజ్జిలు ఆసక్తి చూపుతుండగా, రాజమండ్రి ఎంపీగా ఉన్న మాగంటి మురళీ మోహన్ కోడలు మాగంటి రూపాదేవి పేరు ఈ మధ్యకాలంలో అనూహ్యంగా తెరమీదకు వచ్చింది.

ఈ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ జనాభా ఎక్కువగా ఉంటారు. ఎస్సీ ఓట్ల సంఖ్య 40 వేలు కాగా, బీసీల ఓట్ల సంఖ్య 30 వేలుగా ఉంది. ఎస్సి , బీసీ వర్గాలపై నానికి మంచి పట్టు ఉంది. అందుకే 2014లో వీరి ఓట్లన్నీ కొడాలి నానినే దక్కించుకున్నారు. అలాగే, కమ్మ ఓటర్లు కూడా వైసీపీకే మద్దతు పలకడం కొడాలి కి కలిసొచ్చే అంశం.