ఒకప్పుడు వివాదానికి గురైన ఈ ఫోటోపై ఇటీవల కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందో తెలుసా.?     2018-06-22   01:40:01  IST  Raghu V

బిడ్డకు తల్లి పాలివ్వడం అనేది సర్వ సాధారణమైన విషయం. బిడ్డకు తల్లి పాలిస్తే దాంట్లో ఉండే అనేక పోషకాలు బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ప్రపంచంలో ఏ ఆహారంలోనూ లేని పోషకాలు, ఔషధ గుణాలు తల్లి పాలలో ఉంటాయి కనుకనే వైద్యులు కూడా బిడ్డకు తల్లిపాలు తప్పనిసరి అని చెబుతారు. అయితే కొందరు మాత్రం దీన్ని నామోషీగా ఫీల్‌ అవుతారు. బిడ్డకు పాలిస్తే తమ వక్షోజాలు సాగిపోతాయని, అందాన్ని కోల్పోతామని, సెక్స్‌ అప్పీల్‌ ఉండదని అనుకుంటారు. ఇక కొందరు బిడ్డకు బహిరంగంగా పాలివ్వడానికి సందేహిస్తారు. దీంతో చాలా మంది పిల్లలకు పోషణ సరిగ్గా అందడం లేదు. అయితే జనాల్లో ఉన్న ఈ అపోహలను, మూఢ విశ్వాసాలను పోగొట్టేందుకు ఆ మ్యాగజైన్‌ ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఇంతకీ అదేమిటంటే…

కేరళకు చెందిన ప్రముఖ మ్యాగజైన్‌ గృహలక్ష్మి మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లిపాలపై జనాల్లో ఉండే అపోహలను పోగొట్టేందుకు ఓ వినూత్న ప్రయోగం చేసింది. గిలు జోసెఫ్‌ అనే మోడల్‌తో ఫొటోషూట్‌ చేసింది. ఆమె తల్లి వేషంలో బిడ్డకు పాలు ఇస్తూ ఉంటుంది. అలా పాలు ఇచ్చేటప్పుడు తీసిన ఫొటోను గృహలక్ష్మి మ్యాగజైన్‌ తన కవర్‌ పేజీపై ప్రచురించింది. దీనికి సంబంధించిన పలు ఇతర ఫొటోలను, పలువురు మహిళలు తమ పిల్లలకు పాలిస్తున్న ఫొటోలను కూడా ఆ మ్యాగజైన్‌ తన ఇష్యూ లోపలి పేజీల్లో ప్రచురించింది. తల్లి పాలను ఇవ్వడం అనేది సర్వ సాధారణమైన విషయమని, అందుకు సందేహించాల్సిన పనిలేదని, ఎలాంటి అపోహలకు లోను కావల్సిన పనిలేదని, దాన్ని కాముక దృష్టితో చూడరాదని ఆ మ్యాగజైన్‌ కథనంలో రాసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు పాలిచ్చే తల్లులను ఆ దృష్టితో చూడకండని, అలాగే తల్లులు పైట కొంగు చాటున పాలివ్వాల్సిన పనిలేదని, అందులో దాచాల్సింది ఏమీ లేదని, బహిరంగంగానే పాలివ్వాలని కూడా తెలియజేసింది.