సురేఖ స్పీడ్ కి బ్రేకులు వేసిన గులాబీ బాస్       2018-07-09   02:55:05  IST  Bhanu C

చనువు ఇచ్చాము కదా అని చంకనెక్కి కూర్చుంటారు కొంతమంది. అందుకే ఎవరిని ఇంతలో ఉంచాలోఅంతలోనే ఉంచాలని పెద్దలు ఊరికే చెప్పారు. ఇప్పుడు ఈ విషయం కూడా టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి బాగా తెలిసొచ్చినట్టు ఉంది. అందుకే ఇప్పుడు అతి చనువుతో మారం చేస్తున్న నాయకులను పిలిచి మరీ క్లాస్ పీకుతున్నాడట. కేసీఆర్ తో వ్యవహారం ఎలా ఉంటుంది అంటే.. తనకు ఎవరైనా నచ్చితే కనుక వారికి విపరీతమైన ప్రాముఖ్యత ఇస్తాడు. నచ్చకపోతే వారిని దరిదాపుల్లోకి రానివ్వడు. ఇది టీఆర్ఎస్ నాయకులకు బాగా తెలుసు అందుకే వారు అధినేత ఆగ్రహానికి గురికాకుండా ఆచితూచి మరీ అడుగులు వేస్తుంటారు.

ఇక అసలు విషయానికి వస్తే… తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న కొండా సురేఖ కుటుంబానికి కేసీఆర్ ప్రాముఖ్యత బాగానే ఇస్తూ వస్తున్నాడు. అయితే అదే అదునుగా భావించి కొండా సురేఖ పార్టీ పుట్టి ముంచేలా వ్యవహరిస్తూ కేసీఆర్ ఆగ్రహానికి కారణం అవుతున్నారు. కాంగ్రెస్ లో సముచిత స్తానం లేకుండా ఉన్న కొండా కుటుంబానికి కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ఇస్తే.. ఇంకా తమ ఆశ తీరలేదు అన్నట్టుగా వారు ప్రవర్తిస్తున్నారట. తమ కుటుంబానికి రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని కోరడంతో కేసీఆర్ అవ్వకయ్యాడట. అందుకే ఉన్నపళంగా రమ్మని కబురు పంపి మరీ… ఆమెకు గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. నీ నియోజకవర్గం లో తప్ప ఇక ఎక్కడైనా నీ ప్రతాపం చూపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాడట. నీ పని నువ్వు చుస్కో అంతే కానీ పక్క నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని చెప్పడంతో సురేఖ సైలెంట్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో పోటీకి తమతో పాటు వారసులను కూడా తీసుకొచ్చేందుకు నాయకులూ ఇప్పటినుంచే.. రెడీ అవుతున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో ఆమె కూడా తమ కూతురిని కూడా బరిలో నిలబెట్టాలని భావిస్తున్నారట. కొండా కుటుంబానికి కేసీఆర్ బాగానే ప్రాధాన్యం ఇచ్చాడు. సురేఖ భర్త కొండా మురళీ ఎమ్మెల్సీగా ఉన్నారు. కేసీఆర్‌ మహిళా మంత్రిని నియమించాలనుకుంటే సురేఖకు అవకాశం ఉంటుందనుకున్నారు. కానీ ఆమె స్పీకర్‌ మధుసూదనాచారి నియోజకవర్గమైన భూపాలపల్లి మీద కన్నేశారట.

అక్కడి నుంచి తన కూతురును పోటీ చేయించాలని ఆమె భావిస్తున్నారట. పరకాల, భూపాలపల్లికి ఒరిజినల్‌ టీఆర్‌ఎస్‌ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ రెండింటిలో ఒకచోటి నుంచి తన కూతురును ఎమ్మెల్యేగా చేస్తానని సురేఖ బహిరంగంగా ప్రకటించడంతో టీఆర్ఎస్‌లో వివాదాలు మొదలయ్యాయి. కేసీఆర్ హెచ్చరికలతో ఆమె మెత్తబడతారా.. లేక మళ్ళీ అదే సప్పుడు కొనసాగించి మళ్ళీ అధినేత ఆగ్రహానికి గురవుతారా అనేది చూడాలి.