కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మ‌రో మీడియా     2016-12-27   03:39:44  IST  Bhanu C

ఏంటి ఆశ్చ‌ర్యంగా ఉందా? అయినా కూడా ఇది నిజ‌మే! తెలంగాణ సీఎం, టీఆర్ ఎస్ సార‌ధి కేసీఆర్ మీడియా రంగంలో దూసుకుపోయేందుకు, అన్ని భాష‌లు, వ‌ర్గాల వారికి చేర‌వ అయ్యేందుకు ఎక్క‌డా వెనుకాడ‌డం లేదు. వాస్త‌వానికి తెలంగాణ ఉద్య‌మం హిట్ అయిందంటే.. దానిలో మీడియా పాత్ర‌ను ఏ ఒక్క‌రూ తోసిపుచ్చ‌లేరు. అంత బ‌ల‌మైన ప్రాధాన్యం ఉన్న మీడియా త‌న‌కు శ్రీరామ ర‌క్ష‌గా ఉంటుంద‌ని కేసీఆర్ ఎప్ప‌టి నుంచో భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయన న‌మ‌స్తే తెలంగాణ స‌హా టీ న్యూస్‌కు అంకురార్ప‌ణ చేశారు. అటు ఉద్య‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డంతోపాటు ఏపీ వాళ్ల‌ని క‌డిగేయ‌డానికి ఇది ఒక ఆయుధంగా ప‌నిచేసింది. అంతేకాదు, కేసీఆర్‌ను ఓ రేంజ్‌కి తీసుకువెళ్లింది కూడా ఈ మీడియా సంస్థ‌లే. ఆయ‌న‌కు ఆయ‌న కుటుంబానికీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన మీడియా ఇదే.

ఆ త‌ర్వాత కేసీఆర్ అధికారంలోకి రావ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఆయ‌న మ‌రోసారి తెలంగాణ టీఆర్ ఎస్ జెండా ఎగిరేలా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తున్నారు. పార్టీని, ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియానే ఆయ‌న సాధ‌నంగా ఎంచుకున్నారు. అయితే, ఇప్ప‌టికే ఉన్న న‌మ‌స్తే తెలంగాణ తెలుగు దిన‌ప‌త్రిక‌తో పాటు.. హైద‌రాబాద్‌లో ఎక్కువ‌గా నివసిస్తున్న ఇత‌ర ప్రాంతాల అధికారులు, ఉద్యోగులు, కుటుంబాలు ఉన్న‌త వ‌ర్గాలే ల‌క్ష్యంగా ఆంగ్ల ప‌త్రిక‌ను ఆయ‌న ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఇది ప‌ని కూడా ప్రారంభించింది.

ఇక‌, ఇంత‌లోనే ఆయ‌న ఉర్దూ ప‌త్రిక‌పై దృష్టి పెట్టారు. ముస్లింల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఈ మార్గం బాగుంటుంద‌ని ఊహించిన కేసీఆర్ ఆదిశ‌గా అడుగులు వేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ‘ఉర్దూ’ పాఠకుల కోసం ‘అజాద్‌ తెలంగాణ’ పత్రికను ప్రారంభించోతున్నారట. ఈ మేరకు ఇప్పటికే అన్ని ప్రయత్నాలు ప్రారంభించారట. ఇంతకు ముందు ‘సియాసత్‌’ ‘ఇత్తేమాద్‌’లో పనిచేసిన సీనియర్‌ జర్నలిస్టును దీనికి ఎడిటర్‌గా నియమించారట. మొత్తం మీద తెలంగాణలో మూడు ప్రధానమైన భాషల్లో కేసీఆర్‌ కుటుంబం పత్రికలను తేవడంపై పెద్ద చ‌ర్చ సాగుతోంది.