టీడీపీకి మద్దతుపై టీఆర్ఎస్ లో అయోమయం     2018-07-20   11:08:21  IST  Sai Mallula

కేంద్ర ప్రభుత్వం పై టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అన్ని రాజకీయ పార్టీల్లోనూ కాకా పుట్టిస్తోంది. అన్ని పార్టీల దగ్గరకు తిరిగి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిందిగా టీడీపీ ఎంపీలు కోరుతున్నారు. అవిశ్వాసం నెగ్గుతుందా .. లేదా అనే విషయాలను పక్కనపెడితే కేంద్రం మీద అవిశ్వాసం అన్న విషయం మాత్రం సంచలనం విషయమే. అయితే ఇప్పడు ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై నేతలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.

అవిశ్వాసానికి అనుకూలమా, వ్యతిరేకమా అనే విషయం పై ఎటూ తేల్చుకోలేకపోతోంది. విభజన హామీలపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటన చేసిన టీఆర్‌ఎస్‌కి పార్టీకి అవిశ్వాసం ముందుగా అడ్డొచ్చింది. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా రాదా అనే అంశంపై టీఆర్‌ఎస్‌ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు టీఆర్ఎస్ నిర్ణయం ఏంటన్నది తేలాల్సి ఉంది.

-

అవిశ్వాసానికి మద్దతు విషయంలో టీడీపీ ఎంపీలు టీఆర్ఎస్ ఎంపీల మద్దతు కోరారు కానీ దీనిపై కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. అయితే… తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేదన్న వాదాన్ని వారు వినిపిస్తున్నారు. టీడీపీ అవిశ్వాసానికి కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా… మరికొన్ని తిరస్కరించాయి.

టీడీపీ వైఖరిపై టీఆర్‌ఎస్‌ ఓ వైపు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే….మరో వైపు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చే అంశం కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేక తర్జన భర్జన పడుతోంది. తమను అడిగి తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టిందా అంటూ ఓ ఎంపీ ప్రశ్నించడంతో టీఆర్‌ఎస్‌ ఎంపీల్లో దీనిపై ఏకాభిప్రాయం లేదనేది అర్ధం అవుతోంది. కేసీఆర్ నిర్ణయం దీనిపై ఎలా ఉండబోతుందో చూడాలి.