కంగారు పెట్టిస్తున్న కేసీఆర్ సర్వే.. సిట్టింగుల్లో టెన్షన్       2018-07-04   22:31:37  IST  Bhanu C

అధికారమే లక్ష్యంగా పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక వ్యూహాలకు పదునుపెడుతున్నాడు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా ..? జనాలు ఏమనుకుంటున్నారు ..? పథకాల్లో కానీ, పార్టీలో కానీ ఇంకా ఏమైనా మార్పులు చేయాలా అనే విషయాలపై ఎప్పటికప్పుడు జనం నాడి సర్వేల ద్వారా తెలుసుకుంటున్నాడు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో ఎంతమంది సిట్టింగ్ ఎమ్యెల్యేలు గెలుస్తారు..? ఎక్కడెక్కడ ఎవరెవరిని మార్చాలి అని తెలుసుకుంటూ ఒక అంచనాకి వస్తున్నాడు. అయితే.. ప్రస్తుతం మూడు నెలలకు ఒకసారి చేయిస్తున్న సర్వే మాత్రం టీఆర్ఎస్ నాయకుల్లోనూ.. సిట్టింగ్ ఎమ్యెల్యేల్లోనూ గుబులు పుట్టిస్తోంది.

ముందస్తు సాధారణ ఎన్నికలపై జోరుగా ప్రచారం జరుగుతున్నందున పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల స్థానాల్లో అభ్యర్థుల ప్రతిపాదికనపై అధిష్ఠానం పూర్తిస్థాయి సర్వేకు వెళుతోంది. అందుకే .. సర్వే నిర్వేహించేందుకు కేసీఆర్ ఓ ప్రశ్నవళిని సిద్ధం చేయించారు. దానిలో ఉన్న ప్రశ్నల నుంచి ప్రజలతో సమాచారం సేకరిస్తారు. నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ ఎమ్మె ల్యేల పనితీరుపై పార్టీ అధిష్ఠానం ఇటీవల ఓ సర్వే చేయిం చింది. నియోజకవర్గంలోని ప్రజలతో మమేకమవడం, అధికారులతో వ్యవహరించే తీరు, ప్రభుత్వం ప్రవేశపెడు తున్న సంక్షేమ పథకాల క్షేత్రస్థాయి అమలు అనే ప్రశ్నలతో టీఆర్‌ఎస్ సర్వే నిర్వహించింది.

దీంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీల్లోనూ కొంత భయం పట్టుకుంది. అయితే, సిట్టింగ్ లపై వ్యతిరేకత ఉన్న నేతలు మాత్రం ఈ సర్వేలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిర్వహించే సర్వే ప్రకారమే అభ్యర్థుల ఖరారు ఉంటుందన్న వార్తలు వినబడుతుండడమే వారి సంతోషానికి కారణం.. తాజా సర్వేలో ప్రతికూల నివేదికలు వస్తే తమ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వారిలో తలెత్తుతోంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగు ఎమ్మెల్యే స్థానాల్లో కూడా కొన్నిచోట్ల టీఆర్‌ఎస్ నుంచి ఇతరులు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రతి నియోజకవర్గానికి మూడు నుంచి అయిదు పేర్లను పరిగణనలోకి తీసుకోవడంతో ఇప్పటివరకు మాకు తిరుగులేదు అనుకుంటున్న ఎమ్మెల్యేల్లో ఆనుమానాలు రేకెత్తుతున్నాయి. నియోజకవర్గాల్లో సమీకరణాలు ఎప్పటికప్పుడు సరి చూసుకొంటున్నారు. కొన్ని సిట్టింగు నియోజకవర్గాల్లో పారిశ్రామికవేత్తలు, ఇతర సీనియర్ నేతలు, స్థానికంగా మంచి పేరుండీ ఇతర పార్టీల్లో ఉన్న నేతలు, తటస్థంగా ఉన్నవారు తమకు అవకాశం దక్కుతుందేమో అన్న ఆశలో ఉన్నారు.