టీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు నెంబర్ టూ స్థానంలో కొనసాగిన కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు క్రమక్రమంగా ప్రాధాన్యత కోల్పోయారు.ఆయన్ను పొమ్మనలేక పొగపెట్టినట్టుగా కేసీఆర్ ఆయనకు ప్రాధాన్యత తగ్గించారు.
అంతే కాదు తన కుమారుడు కేటీఆర్ కు తిరుగులేని రాజకీయ భవిష్యత్తు అందించేందుకు కేసీఆర్ ఈ విధంగా చేస్తున్నాడనే వాదన కూడా తెరపైకి వచ్చింది.కేటీఆర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశాక హరీష్ రావును కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం చేసేసారు.
అయితే ఈ పరిణామాలపై మాత్రం హరీష్ ఎక్కడా తొందరపడకుండా సైలెంట్ గానే ఉండిపోయారు.అంతే కాదు కేసీఆర్ ఎంత ప్రాధాన్యత తగ్గించినా ఆయన మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకే వెళ్లారు.
తెలంగాణాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ హరీష్ రావు కు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం వరకే పరిమితం చేశారు.అదే సమయంలో కేసీఆర్, కేటీఆర్ మాత్రం రాష్ట్రమంతా పర్యటనలు చేశారు.
అయితే, పార్టీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి.కనీసం 15 స్థానాలు గెలుస్తామని ధీమాగా ఉన్న పార్టీ కేవలం 9 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఏకంగా ముఖ్యమంత్రి కుమార్తె కవిత, సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఓటమిచెందారు.అదీ కాకుండా కాంగ్రెస్, బీజేపీలు గతంకంటే ఎక్కువుగా బలపడడం కేసీఆర్ లో ఆందోళన పెంచింది.
అందుకే ఇప్పుడు నష్ట నివారణ చర్యలు తీసుకునే పనిలో పడ్డారు.

దీనిలో భాగంగానే హరీష్ రావును ప్రగతి భవన్ కు పిలిపించుకుని మరీ మాట్లాడారు కేసీఆర్.హరీష్ రావు బాధ్యతలు తీసుకున్న మెదక్ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.దీంతో హరీష్ రావును కేసీఆర్ ఆభినందించారు.
హరీష్ రావును ఈసారి కూడా కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.త్వరలోనే క్యాబినెట్ విస్తరణ జరగనుంది.
ఇందులో హరీష్ రావుకు మంత్రి పదవి వారించబోతోందట.మెదక్ జిల్లా నుంచి మొదటి విడతలో ఎవరినీ క్యాబినెట్ లోకి తీసుకోకపోవడంతో ఇప్పుడు జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు ప్రాధాన్యం దక్కే అవకాశం మెండుగా ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.