కేటీఆర్ కాదు కేసీఆర్ చెబితేనే 'సెట్' అవుతారంట !   KCR Is The Dictator Of TRS Leaders In Telangana     2018-10-30   10:27:03  IST  Sai M

తెలంగాణాలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిసర నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సెటిలర్స్ ఉన్నారు. అందుకే వారి ఓట్లపై అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు కన్నేశాయి. ఇంతకు ముందు .. ముందు వెనుక చూడకుండా ఆంధ్ర ప్రజలపై టీఆర్ఎస్ అధినాయకుడితో పాటు ఆ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకున్నారు. అయితే ఇది ఎన్నికల సమయం కావడంతో తీరిగ్గా నాలుక కరుచుకుని నష్ట నివారణ చర్యలకు దిగారు. దీనిలో భాగంగానే… తెలంగాణలోని సీమాంద్ర ప్రజలకు తాను అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు మద్దతు ఇచ్చిన హైదరాబాద్‌లోని సీమాంద్ర ఓటర్లు, ప్రస్తుతం మనసు మార్చుకుని … టీఆర్‌ఎస్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నట్టు తాజా మాజీ సెటిలర్ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. టీఆర్‌ఎస్ పట్ల సీమాంద్ర ప్రజలకు ఏర్పడిన అపోహలను తొలగించడానికి ‘మన హైదరాబాద్-మన అందరి హైదరాబాద్’ పేరిట నిజాంపేటలో మంత్రి కేటీఆర్ సమావేశం పెట్టి తాను వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని హామీ ఇవ్వడానికి కారణంగా చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేసేస్థాయిలో ఉన్న సీమాంధ్ర ఓటర్లకు భరోసా కల్పించడం ద్వారా దిద్దుబాటు చర్యలకు టీఆర్‌ఎస్ దిగినట్టుగా అర్ధం అవుతోంది.

ఇటీవల టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్, నల్లగొండలో నిర్వహించిన ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ వ్యాఖ్యల వల్ల హైదరాబాద్‌తో పాటు రాష్టవ్య్రాప్తంగా ఉన్న సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సెటిలర్ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పార్టీ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తూ, తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలంతా తెలంగాణ బిడ్డలేనని, తాము ఇంకా పరాయివాళ్లమన్న భావనను వదిలేయాలని చెప్పారు.

KCR Is The Dictator Of TRS Leaders In Telangana-

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎన్నో చేసుకుంటాం, వాటిని రాజకీయ నేతల మధ్య జరిగినట్టుగా భావించాలి తప్ప ఒక ప్రాంత ప్రజలను ఉద్దేశించి చేసినట్టుగా భావించవద్దని కేటీఆర్ వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే… కేటీఆర్ ఇచ్చిన భరోసాతో సంతృప్తి చెందని సెటిలర్ ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ చెబితే బాగుంటుందని తాజాగా టీఆర్‌ఎస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.