కేసీఆర్ ఈ నాలుగేళ్లలో ఏంచేసాడు ..? ప్లస్ ..మైనెస్ లు ఇవే !       2018-06-07   05:41:50  IST  Bhanu C

అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ .. పరిస్థితులకు అనుగుణంగా తన ప్రసంగాన్ని మార్చుకుంటూ .. మొండివాడిగా .. సమర్ధవంతమైన రాజకీయ వ్యూహకర్తగా విజయవంతంగా దూసుకుపోతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నాలుగేళ్ళ కాలంలో సాధించిన ప్రగతి ఏంటి ..? రాజకీయంగా ఆయన ఎటువంటి వ్యూహాలకు పదునుపెట్టాడు అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటే రాబోయే కాలంలో ఆయన అనుసరించబోయే వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి. టీఆర్ఎస్ గెలుపుకు ఆయన వేయబోతున్న స్కెచ్ లు ఏంటి అనేది స్ప్రష్టంగా తెలుస్తుంది. అసలు చంద్రశేఖరరావు ప్లస్ లు ఏంటి మైనెస్ లు ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం.

కేసీఆర్ పరిపాలన ఇప్పటి వరకు నల్లేరు మీద బండిమాదిరే సాగించారని చెప్పాలి. అన్నిటికి మించి తనను,తన పాలనను ఎద్దేవ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన కంటే కేసీఆర్ ఎంతో బెటర్ అన్న భావనను అందరిలోనూ .ముఖ్యంగా ఆంద్ర ప్రజలలో ఇది ఎక్కువగా ఉండడం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి.కెసిఆర్ తెలివిగా తన బలహీనతలను కనిపించనివ్వకుండా, ప్రజలను వివిధ పధకాలతో ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు.

ఆయన పాలనలో ప్లస్ లు ఉన్నాయి..మైనస్ లు ఉన్నాయి. ప్లస్ లు చూస్తే రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తానని ప్రకటించి,నాలుగు దశలలో చేయడం. అయితే ఒకసారి ఇవ్వకపోవడం వల్ల రైతులకు పెద్దగా ఉపయోగం జరగలేదనే వాదన ఉన్నా, ఓకేసారి లక్ష రూపాయల చొప్పున చేయడం అంత తేలికైన పని కాదన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో ఇతర ప్రాంతాల ప్రజలకు,ముఖ్యంగా సీమాంద్రులకు పెద్దగా గొడవలు లేని పరిస్థితి ఏర్పడడం, శాంతి బద్రతలు సజావుగా ఉండడం ఆయనకు కలిసి వచ్చే పాయింట్.

హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల లో ఆ ప్రాంతం,ఈ ప్రాంతం వారు అని చూడకండా ఏకమొత్తంగా టిఆర్ఎస్ కు ఓట్లు పడడమే ఇందుకు నిదర్శనగా ఉంటుంది. ప్రతిష్టాత్మక్మైన కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి తదితర ప్రాజెక్టును చేపట్టడం. వీటిలో కాళేశ్వరానికి అత్యదిక ప్రాదాన్యత ఇవ్వడం.వేల కోట్ల రూపాయలను వెచ్చించడం. మిషన్ భగీరద కింద ఇంటింటికి నీరు పథకంపై వివిధ రాష్ట్రాల వారు ప్రశంసలు కురిపించారు. గురుకుల పాఠశాలలను బాగా పెంచడం, తెలుగు ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు ఆయన కు బాగా పేరు తెచ్చిపెట్టాయి.

అలాగే రైతు బంధు పథకం రైతులకు ఎకరాకు ఎనిమిదివేల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించి తొలి దశలో నాలుగు వేల రూపాయల చొప్పున పంపిణీ చేశారు. ఇది రైతు వర్గాలలో సానుకూలత ఉందని చెప్పాలి. భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు అలాగే రైతులందరికి భీమా సదుపాయం కల్పించాలని కొత్త ప్రయత్నం చేస్తున్నారు. కాగా తనకు ఇక్కడ తలనొప్పి లేకుండా చంద్రబాబును ఆంధ్రాకి పంపించేయడంతో రాజకీయంగా ఆయన కు ఎదురు లేకుండాపోయిందని చెప్పాలి.

ఇక మైనస్ పాయింట్లు చూస్తే కెసిఆర్ ఏడాదికి పైగా సచివాలయానికి వెళ్లకపోవడం పెద్ద లోటు అని చెప్పాలి. ఆయన అన్ని ప్రగతి భవన్ లోనే నడుపుతున్నారు.దాంతో సచివాలయ ప్రాదాన్యత తగ్గిపోయింది. వాస్తు వంటి నమ్మకాలు ఎక్కువగా ఉండడం కూడా దీనికి కారణం కావచ్చు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపడలేరని భీషణ ప్రతిజ్ఞలు చేసిన కెసిఆర్ ఆ తర్వాత తగ్గిపోవడం కెసిఆర్ కు అప్రతిష్టే అని చెప్పాలి. రైతు తెలంగాణలో ప్రజాస్వామిక వాతవరణం లేకుండా చేస్తున్నారన్న విమర్శకు కొంత మేర ఆస్కారం ఇచ్చారు.

ధర్నాలు,నిరసనలు చేయడానికి అనువుగా ఉన్న ప్రదేశాన్ని ఎత్తివేయడం, ఎక్కడో దూరంగా ధర్నాలుచేసుకోవాలని చెప్పడం, భూసేకరణలో విమర్శలు ఎదుర్కోవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లను శాసనసభ నుంచి వేటు వేసిన తీరు కేసీఆర్ కి మచ్చ తెచ్చే అంశాలే.

ప్రభుత్వంపై విపక్షాలు కొన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి. అలాగే నిరుద్యోగ సమస్యపై కోదండరామ్ వంటి నేతలు ఆరోపణలు చేస్తుంటారు.తెలంగాణకు ఈ అరవై ఏళ్లలో లేనంత అప్పు ఈ నాలుగేళ్లలోనే చేయడం కూడా ప్రమాదకరమే. ధనిక రాష్ట్రం అని ప్రచారం చేస్తూ భారీ ఎత్తున అప్పులు చేయడం వల్ల ఎంత ప్రయోజనం అన్నది భవిష్యత్తులోనే తేలుతుంది. ఏది ఏమైనా ఇప్పటికైతే తెలంగాణలో ప్రతిపక్షాల కన్నా కేసీఆర్ బలంగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు తన వ్యూహాలకు పదునుపెట్టడంతో పాటు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా అన్నిటిలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండడం బాగా కలిసొస్తుంది.