కేసీఆర్ 39 మంది అవుట్ లిస్టులో ఉంది వీళ్లే..       2018-06-10   23:47:09  IST  Bhanu C

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందో లేదోనని భయాందోళన చెందుతున్నారు. టీఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేయించిన సర్వే నేతల్లో వ‌ణుకు పుట్టిస్తోంది. ఈ సర్వేలో 39 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమనే అభిప్రాయం వ్యక్త‌మ‌వ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈ క్రమంలో బ్లాక్ లిస్టులో తమ పేరు ఉందేమోననే సందేహం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఏర్ప‌డుతోంది. దీనికి తోడు మరోపక్క సోషల్ మీడియాలో వరుసగా వస్తున్న వార్తలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో టికెట్ రేసులో ఉన్న మిగ‌తా ఆశ‌వ‌హులు ఆనంద‌ప‌డుతున్నారు.

టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశంలో తమ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా డైమండ్స్ అంటూ సీఎం కేసీఆర్ కితాబు ఇచ్చారు. అంతేకాక వచ్చే ఎన్నికల్లో సిట్టింగులందరికి సీట్లు ఇస్తామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిష్ట వేసి ప్రజలతో మమేకమవుతున్నారు. తమ నియోజకవర్గలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొన్నారు. అర్బన్ ఏరియాలకు చెందిన ప్రజాప్రతినిధులు తమ డివిజన్ లలో ఇంటింటికీ తిరుగుతున్నారు. మొత్తంగా రాబోయే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో తెరపైకి కొత్తగా వచ్చిన సర్వే రిపోర్టు సదరు ఎమ్మెల్యేలలో తీవ్ర అలజడి రేపుతోంది. కాగా కేవలం నెల రోజుల వ్యవధిలోనే తమ పరిస్థితి తారుమారు కావడంపై ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని ప్రచారం జరుగుతున్న 39 మంది ఎమ్మెల్యేల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి నలుగురు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో సదరు ఎమ్మెల్యేల పేర్లు చక్కర్లు కొడుతుండడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.

ములుగు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అజ్మీరా చందులాల్, భూపాలపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పేర్లు లిస్టులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా ఎమ్మెల్యేలతో పాటు అనుచరగణం కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏదేమైనా ముఖ్యమంత్రి సర్వే రిపోర్టులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.