బాల‌య్య ఫ్యాన్స్‌పై క‌న్నేసిన వైసీపీ ఎమ్మెల్యే       2018-06-19   03:35:19  IST  Bhanu C

ఏపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా గెలిచి అధికారాన్ని ద‌క్కించుకునేందుకు వైసీపీ నేత‌లు జోరుగా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇతర పార్టీ నేత‌లు, టీడీపీలో అసంతృప్తి నాయ‌కుల‌తో `ట‌చ్‌`లో ఉంటూ వారిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు చాప కింద నీరులా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయ‌కులపై పూర్తిగా దృష్టిసారించారు. అంతేగాక టీడీపీకి అండ‌గా ఉన్న అభిమాన సంఘాల‌నూ ఆక‌ర్షించే ప‌నిలో ప‌డ్డారు.

ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీ న‌టుడు బాల‌కృష్ణ అభిమానుల మ‌ధ్య విభేదాల‌ను.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యే తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తు న్నార‌ట‌. ఇప్ప‌టికే తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అసంతృప్తుల‌కు గేలం వేసి విజ‌య‌వంతమైన ఆయ‌న.. ఇప్పుడు బాల‌య్య అభిమానుల‌పై క‌న్నేయ‌డం.. హాట్‌టాపిక్‌గా మారింది. నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ బ‌లంగా ఉన్నా.. మ‌రికొన్ని ప్రాంతాల్లో టీడీపీ గ‌ట్టి ప‌ట్టు సాధించింది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం కొన్ని ప్రాంతాల్లో మ‌రింత ప‌టిష్టంగా ఉంది. ఆ పార్టీ బ‌లాన్ని త‌గ్గించేందుకు వైసీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదే స‌మ‌యంలో టీడీపీలో లుక‌లుక‌లు.. వైసీపీ నేత‌ల‌కు ప్ల‌స్ అవుతున్నాయి. అసంతృప్తితో రగులుతున్న నేత‌ల‌పై దృష్టిసారించేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను ప్రారంభించారు.

కావలి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం ఆక‌ర్ష్ ప‌థ‌కం స‌త్ఫ‌లితాలు ఇచ్చేలా క‌నిపిస్తోంది. టీడీపీ బలంగా ఉన్న వార్డుల్లో తన ప్రాభల్యాన్ని పెంచుకుంటోంది. పట్టణంలో టీడీపీ బలంగా ఉన్న వార్డులతో పాటు ఆ పార్టీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులున్న వార్డులపై కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దృష్టి సారించారు. టీడీపీలో కొనసాగుతున్న వారిని వైసీపీ పట్ల ఆకర్షితులను చేసి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఏఎంసీ చైర్మన్‌ టీడీపీ పట్టణ ప్రధాన నాయకుడు మలిశెట్టి వెంకటేశ్వర్లు వార్డుపై తొలుత ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి దృష్టి పెట్టారు. మలి శెట్టికి అనుచరులైన కొంతమందిని వైసీపీలో చేర్చుకుని వారి ఫోటోలతో పట్టణంలోని ప్రధాన సెంటర్‌లలో ఫ్లెక్సీలు వేశారు.

ఇక బాలకృష్ణ అభిమాన సంఘ నాయకులపైనా ఎమ్మెల్యే దృష్టి పెట్టారు. బాలకృష్ణ అభిమాన సంఘాల మధ్య గొడవ జరగగా.. అందులో గాయపడ్డ అభిమాన సంఘ నాయకుడు వల్లెపు కిషోర్‌ను అర్ధరాత్రి ఏరియా వైద్యశాలకు వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించడం చర్చ‌నీయాంశమైంది. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షుడు అమరా వేదగిరి వార్డుపై దృష్టి పెట్టి అక్కడ ముఖ్యమైన కొందరు నాయకులతో చర్చలు జరుపుతున్నారు. 37వ వార్డులో గతంలో కాంగ్రెస్‌పార్టీ తరుపున కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయిన మహేష్‌ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతుండగా ఆయనతో ఎమ్మెల్యే అనుచరులు చర్చలు జరుపుతున్నారు.

39వ వార్డులో కొంత మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను శనివారం వైసీపీలోకి చేర్చుకున్నారు. ఇలా పట్టణంలో ప్రతి వార్డులో వైసీపీ ఆకర్ష్‌ పథకంలో భాగంగా టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలపై దృష్టి పెట్టి వారిని వైసీపీలోకి చేర్చుకునేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఈ ప‌రిణామాలు టీడీపీ నేత‌ల‌కు మింగుడుప‌ట‌డం లేద‌ట‌.