కొందరు ప్రభుత్వ ఉద్యోగుల తీరు దారుణంగా ఉంటుంది.వారు ప్రజాసేవకులై ఉండి కూడా చాలా మంది ప్రజల పట్ల వారి ప్రవర్తన జుగుప్సాకరంగా ఉంటుంది.
ముఖ్యంగా పేదలను వారు చాలా చులకనగా చూస్తారు.బాగా డబ్బున్న వాళ్లు అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చే మర్యాదలు కూడా పెరుగుతాయి.
తాజాగా ఇలాంటి ఓ షాకింగ్ ఘటన కర్ణాటకలో జరిగింది.ఆ రాష్ట్రానికి చెందిన ఆర్‌టీసీ కండక్టర్ ఒకరు ఓ ప్రయాణికుడి పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు.గుండెలపై తన్నడమే కాకుండా, బస్సు నుంచి కిందికి తోసేశాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇటీవల కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులో విస్మయకర ఘటన చోటుచేసుకుంది.మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించాడు.
అయితే అతడిని బస్సు కండక్టర్ అడ్డుకున్నాడు.అంత వరకు బాగానే ఉన్నా ప్రయాణికుడిపై కండక్టర్ దాడికి దిగడం విమర్శలకు తావిస్తోంది.
నచ్చజెప్పి, అతడిని బస్సు ఎక్కనీయకుండా చేయొచ్చు.అతడు మద్యం తాగడం వల్ల బస్సులో ఉన్న మహిళలు, చిన్న పిల్లలు ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడొచ్చని ఆ మందుబాబుకు అర్ధం అయ్యేలా చెప్పొచ్చు.
అయితే కండక్టర్ మాత్రం సహనం కోల్పోయాడు.తానేదో పోలీస్ అనే తరహాలో ప్రవర్తించాడు.
ఎంత చెప్పినా వినకుండా బస్సు ఎక్కుతున్నాడనే కోపంలో అతడిని కండక్టర్ చెంపదెబ్బ కొట్టాడు.అంతటితో ఆగకుండా పట్టరాని కోపంతో ప్రయాణికుడి గుండెలపై తన్నాడు.కండక్టర్ తన్నగానే ఆ ప్రయాణికుడు రోడ్డుపై వెల్లకిలా పడిపోయాడు.బస్సులోని ప్రయాణికులు ఈ సంఘటన చూసి దిగ్భ్రాంతి చెందినట్లు వీడియోలో కనిపిస్తోంది.ఇంత జరుగుతున్నా, ఆ ప్రయాణికుడిని కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు.కాసేపటికే బస్సు బయల్దేరి వెళ్లిపోయింది.
ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కాగానే కండక్టర్‌పై నెటిజన్లు దుమ్మెత్తి పోశారు.ఆ కండక్టర్ వ్యవహారం ఉన్నతాధికారులకు చేరింది.
దీంతో అతడిపై వెంటనే సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది.