క‌ర్ణాట‌క పాపం ఎవ‌రిది.. పాల‌కుల‌దా..? ప‌్ర‌జ‌ల‌దా..?       2018-05-19   02:26:03  IST  Bhanu C

తీవ్ర రాజ‌కీయ సంక్షోభంలో కూరుకుపోయిన క‌ర్ణాట‌కలో ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డం అంత ఈజీ ఏమీ కాదు. ఒక‌వేళ ఏర్ప‌డినా ఐదేళ్లు పూర్తి చేసుకోవ‌డం న‌ల్లేరుపై న‌డ‌క కూడా కాదు! ఈ మాట అంటున్న‌ది క‌ర్ణాట‌క రాజ‌కీయ నాయ‌కులు కానీ, రాజ‌కీయ విశ్లేష‌కులు కానీ కాదు. త‌ల‌పండిన న్యాయ కోవిదులు! ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ఎదుర్కొంటున్న సంక్షోభం స‌మ‌సి పోవ‌డం కూడా అంత ఈజీ కాద‌ని అంటున్నారు. దీనికి రీజ‌న్ కూడా చెబుతున్నారు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాలేదు. అయితే, బీజేపీకి మాత్రం మేజిక్ ఫిగ‌ర్‌కు ద‌గ్గ‌ర దాకా వ‌చ్చి.. 104 ద‌గ్గ‌ర సీట్లు నిలిచిపోయాయి. ఇక‌, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 38 సీట్లు వ‌చ్చాయి. అయితే, ఇలాంటి ప‌రిస్థితిలో మేజిక్ ఫిగ‌ర్‌కు ద‌గ్గ‌ర‌గా నిలిచి లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు పిలిచారు.

అయితే, బీజేపీపై క‌త్తిక‌ట్టిన కాంగ్రెస్ ఈ ప‌రిణామాన్ని జీర్ణించుకోలేక‌.. గ‌తంలో జ‌రిగిన త‌ప్పులు పున‌రావృతం కారాద‌ని గ్ర‌హించిన కాంగ్రెస్‌.. వెంట‌నే ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్‌తో పొత్తుకు సిద్ధ‌మైంది. దీంతో రాజ‌కీయ కాక పీక్‌కు చేరిం ది. ఇక‌, ఇప్పుడు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన య‌డ్యూర‌ప్ప‌కు అవ‌కాశం ఇచ్చిన గ‌వ‌ర్న‌ర్‌.. గురువారం ఉద‌య‌మే ముహూర్తం నిర్ణ‌యించారు. అయితే, దీనిపై హ‌తాశులైన కాంగ్రెస్‌, జేడీఎస్‌లు సుప్రీం కోర్టు గ‌డ‌ప తొక్కాయి. దీంతో అర్ధ‌రాత్రి రెండున్న‌ర‌కు విచార‌ణ ప్రారంభించిన సుప్రీం కోర్టు.. దాదాపు మూడు గంట‌ల పాటు కాంగ్రెస్, బీజేపీ త‌ర‌ఫు న్యాయ‌వాదుల వాద‌న‌లు విని.. తుద‌కు య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణాన్ని మాత్రం వాయిదా వేయ‌లేమ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే, అదేస‌మ‌యంలో య‌డ్డీ బ‌ల ప‌రీక్ష‌కు గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన 15 రోజుల గడువును కేవలం 3 రోజుల‌కే కుదించి శ‌ని వారం సాయంత్రం 4 గంట‌ల క‌ల్లా బ‌లప‌రీక్ష నెగ్గాల‌ని సూచించింది. క‌ట్ చేస్తే.. కాంగ్రెస్‌, జేడీఎస్ ఎమ్మెల్యేలు హైద‌రాబాద్‌కు చేరిపోవ‌డం, బీజేపీ బేర‌సారాల్లో మునిగి పోవ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఈ ప‌రీక్ష శ‌నివారంతోనే ఆగుతుందా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. న్యాయ‌కోవిదులు చెబుతున్న విష‌యం ఏంటంటే.. శ‌నివారం నాటి బ‌ల‌ప‌రీక్ష‌లో.. య‌డ్డీ చేతులు ఎత్తేస్తే.. త‌రువాత ప్ర‌భుత్వ ఏర్పాటు అంశం కాంగ్రెస్‌, జేడీఎస్‌ల‌కు ద‌క్కుతుంది. అంటే 78+38=116 మంది ఎమ్మెల్యేల‌తో వీరు బ‌ల‌ప‌రీక్ష‌కు రెడీ అవుతారు. అంటే మేజిక్ ఫిగ‌ర్‌కు ముగ్గురు మాత్ర‌మే వీరికి ఎక్కువ మంది ఉన్న‌ట్టు. వీరు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసినా.. పాల‌కుల‌కు కంటిపై కునుకు ఉండ‌దు.
ఇక్క‌డే అస‌లు సిస‌లు రాజ‌కీయం మొద‌ల‌వుతుంది. కాంగ్రెస్‌+జేడీఎస్ ప్ర‌భుత్వంలో అసంతృప్తుల‌కు బీజేపీ గాలం విస‌ర‌డం ఖాయం.. అప్పుడు ఓ ప‌ది మంది వెళ్లిపోయినా.. ఖ‌చ్చితంగా ఈ ప్ర‌భుత్వం కూలిపోవ‌డం ఖాయం. మ‌ళ్లీ అప్పుడు కూడా బ‌ల ప‌రీక్షఅంశం మొద‌టికే వ‌స్తుంది. ఇక‌, ఇలా అసంతృప్తుల‌కు గాలం వేసి.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినా.. బీజేపీకి కూడా నిద్ర ప‌ట్ట‌దు. సేమ్ సీన్ మ‌ళ్లీ రిపీట్ అవ‌డం ఖాయం. బీజేపీలో అసంతృప్తులు ఎప్పుడైనా ఎక్క‌డైనా కూడా తిరుగుబావుటా ఎగ‌రేయ‌డం ఖాయం. ఈ ప‌రిస్థితి ఒక్క‌రోజుతో పోయేదికాదు.. రౌండ్ ది క్లాక్ మాదిరిగా ఐదేళ్ల‌లో ఎప్ప‌డైనా జ‌రిగేదే! మ‌రి దీనికి కార‌కులు ఎవ‌రు? ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగా ణ సీఎం కేసీఆర్ లు ఇచ్చిన పిలుపు అందుకుని ప్ర‌జ‌లు చేసిన త‌ప్పా? !! ఇప్పుడు ఇదే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.