టీడీపీ కి షాక్ ! వైసీపీలోకి కరణం ఫ్యామిలీ.. ?       2018-05-30   01:03:21  IST  Bhanu C

రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీలు కూడా బలమైన సామాజిక వర్గాలను మచ్చిక చేసుకోవడానిక ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. తాజాగా జగన్ పార్టీ కూడా ఇదే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఇటీవల కృష్ణా జిల్లాల్లో బలమైన కమ్మ సామాజిక వర్గం నేతలకు జగన్ పార్టీ గాలం వేసింది. దానిలో భాగంగానే యలమంచిలి రవి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాపై దృష్టిసారించింది. వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఈ జిల్లాల్లో అద్దంకి నియోజకవర్గంపై కన్నేసిన ఆ పార్టీ ఇప్పుడు కరణం బలరాంని పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కరణం బలరాం తో పాటు ఆయన కుమారుడికి కూడా టికెట్ ఆఫర్ చేస్తోంది వైసీపీ.

వైసీపీకి ప్రకాశం జిల్లాలో గట్టి పట్టు ఉంది. గత ఎన్నికలు కూడా ఇదే రుజువు చేసింది. మళ్ళీ ప్రకాశం జిల్లా లో బలం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఆ జిల్లాలో టీడీపీ కి బలమైన నేతగా ఉన్న కరణం బలరాం ని పార్టీ లోకి తీసుకొచ్చి బలం పెంచుకోవాలని వైసీపీ చూస్తోంది. ఆయన కూడా ఎప్పటి నుంచో టీడీపీ అధినేతపై అసంతృప్తిగానే ఉన్నారు. అందుకే కరణం ను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను వైవీ సుబ్బారెడ్డికి జగన్ అప్పగించారు.

అడ్డంకి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున గొట్టిపాటి రవికుమార్ గెలుపొందారు. అయితే టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గొట్టిపాటి టీడీపీ గూటికి చేరిపోయారు. అయితే గొట్టిపాటి రాకను తట్టుకోలేని కరణం చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. వారి ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత వైరాన్ని ఆసరా చేసుకుని కరణం బలరాం ని వైకాపాలోకి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బలరాం వైరి వర్గం నేత బాచిన చెంచు గరటయ్య వైకాపా లో ఉండటం, వీరిద్దరూ కలిసి పనిచేస్తే గెలుపు నల్లేరుపై నడకేనని వారు భావిస్తున్నారు. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో ఖర్చు మొత్తం పార్టీ పెట్టుకుంటుందని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం.

కరణం కుమారుడు వెంకటేష్ కి కూడా టికెట్ ఇస్తాం అని, ఇద్దరు పోటీ చెయ్యాలని వైసీపీ ఆఫర్ ఇచ్చిందట. నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఇప్పటికీ పూర్తి పట్టు ఉందని, మిగతా మండలాల్లో బలరాం చూసుకుంటే సరిపోతుందని అందుకే గెలుపు సునాయాసం అని నమ్మకంగా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఉంటే వారికి సీటు వచ్చే అవకాశం లేదని, గోట్టిపాటికే సీటు ఇస్తారని అందుకే ఆయన వైకాపా లోకి వస్తారని ప్రచారం చేస్తున్నట్టు గా తెలుస్తుంది.

గత ఎన్నికల్లో ఓడిపోయిన కరణం వెంకటేష్ కి ఈసారి సీటు వచ్చే అవకాశం లేదని, అతని రాజకీయ భవిష్యత్ ముగిసినట్టే అని కూడా నియోజకవర్గంలో కూడా ప్రచారం కూడా వైకాపా చేస్తుంది. దానికితోడు ఇటీవల ముఖ్యమంత్రిపై బలరాం కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు, ఇవి కూడా వైకాపా లో చేరిక కోసమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కరణం టీడీపీ నుంచి బయటకు వెళ్లరని ఇదంతా వైసీపీ కుట్ర అని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.