కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి.రెండు నెలల పరిపాలనలో జగన్ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టినా ఏదో ఒకరకమైన ఇబ్బందులు ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపులను బీసీల్లో చేర్చాలంటూ కాక రేపిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు.అదే సమయంలో కాపు ఉద్యమాన్ని అణిచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరించి కాపుల ఆగ్రహానికి గురయ్యింది.
ఆ తరువాత తరువాత ఈ ఉద్యమం సైలెంట్ అయిపొయింది.తాజాగా మరోసారి కాపు రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చేందుకు, దీనికోసం ఉద్యమం మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
వైసీపీ అధినేత జగన్ ముందు నుంచి కాపుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంటే అసలు కాపులను మభ్యపెట్టి మోసం చేస్తున్నది తెలుగుదేశమేనని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు తమను వాడుకుంటున్నారని ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, టిడిపి సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రు గొంతు పెంచారు.మాట తప్పను మడమ తిప్పను అని పదేపదే చెప్పే జగన్, కాపులను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాపులకు న్యాయం చేసే ఉద్దేశం జగన్ కు లేదని ముద్రగడ వాదిస్తుంటే తమ హక్కుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిన అవసరం ఉందని జ్యోతుల నెహ్రూ స్వరం పెంచుతున్నారు.
ఈ పరిణామాలు వైసీపీలో ఉన్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.వైసీపీ కాపు సామాజికవర్గానికి చెందిన శాసనసభ్యులు ఒకరోజు అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లకుండా సమావేశం నిర్వహించి ఇదే అంశంపై సమీక్షించి జగన్ దగ్గర తేల్చుకునేనే వరకు వెళ్లారంటే, కాపు రిజర్వేషన్ల రగడ ఏమేర ఉండబోతోందో అర్ధం అవుతోంది.
మరో కొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ‘కాపు’ ఉద్యమం ఉదృతం అయితే అది తమకు ఖచ్చితంగా దెబ్బేస్తుందని, అందుకే వీలైనంత తొందరగా ఈ ఉద్యమం మొదలవ్వకుండా చూడాలని జగన్ వ్యూహం రచిస్తున్నాడు.ఈ అంశం మన పార్టీ పీకకు చుట్టుకోకముందే ఏదో విధంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రెండు వేలకోట్ల సహాయంతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్నారు.జగన్ సీఎం అయ్యేందుకు కాపు సామాజిక వర్గం నాయకులు కీలకపాత్ర పోషించారని, ఆ విషయాన్ని జగన్ గుర్తించాలని కాపు నేతలు గుర్తుచేస్తున్నారు.
జగన్ మాత్రం ఈ వ్యవహారాన్ని కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టుగా పరిష్కరించాలని చూస్తున్నాడట.