ఏపీ బీజేపీలో క‌మ్మ వ‌ర్సెస్ కాపు   Kapu Vs Kamma In Ap BJP     2016-12-23   22:50:24  IST  Bhanu C

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడి నియామ‌కంలో ఆ పార్టీ బీజేపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేక‌పోతోంది. 2019 నాటికి ఏపీలో సొంతంగా ఎదిగేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న ఆ పార్టీ సొంతంగా ఎదిగేలా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంది. ఇందుకోసం కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభించాల్సిన స‌మ‌యం మించిపోతున్నా.. బీజేపీ అధిష్టానం పెద్దగా స్పందిస్తున్న దాఖ‌లాలు లేవు.

ఓ జాతీయ‌ పార్టీ రాష్ట్రాల్లో ఎద‌గాలంటే.. అధ్య‌క్ష ప‌ద‌వి కీల‌కం. పార్టీ శ్రేణుల‌ను ముందుండి న‌డ‌ప‌డ‌మే కాకుండా.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్ల‌గ‌లిగేది పార్టీ అధ్య‌క్షుడే. అయితే ఏపీలో ప్ర‌స్తుతం అన్ని రాజ‌కీయ పార్టీల్లోను కుల‌ప్రాతిపదిక‌న పాలిటిక్స్ న‌డుస్తున్నాయి. దీంతో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిని ఎంపిక చేయ‌డం బీజేపీ అధిష్టానానికి క‌త్తిమీద సాములా మారింది. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు ప‌ద‌వీ కాలం తీరి ఏడాది అయింది. ఈ ప‌ద‌వి కోసం చాలా మంది ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కేంద్ర మంత్రి వెంక‌య్య వ‌ర్గం మరోసారి హ‌రిబాబుకే ఏపీ బీజేపీ ప‌గ్గాలు ద‌క్కేలా తెర‌వెన‌క మంత్రాంగం న‌డుపుతోంది. హ‌రిబాబు క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు. ఇక ఇదే ప‌ద‌వి కోసం టీడీపీతో ఢీ అంటే ఢీ అనేలా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఎమ్మెల్సీ, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సోము వీర్రాజు సైతం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ రెండు వర్గాల్లో క‌మ్మ వ‌ర్గానికి చెందిన కేంద్ర మంత్రి వెంక‌య్య‌, ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్‌, హ‌రిబాబు ఓ వ‌ర్గంగా ఉంటున్నారు.

ఇక ఇదే ఏపీ బీజేపీలో కాపు వ‌ర్గం నుంచి ఏపీ బీజేపీ ప‌గ్గాల కోసం పోటీప‌డుతోన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో పాటు మ‌రో బీజేపీ మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావు, రాజ‌మండ్రి అర్బ‌న్ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ ఓ వ‌ర్గం ఉంటున్నారు. దీంతో ఏపీ బీజేపీలో చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉండే క‌మ్మ వ‌ర్గం, చంద్ర‌బాబుకు యాంటీగా ఉండే కాపు వ‌ర్గం ఏపీ బీజేపీ అధ్య‌క్ష పీఠం కోసం కొట్టుకుంటున్నాయి.

టీడీపీతో పొత్తు ఉన్నా సోము మాత్రం చంద్ర‌బాబ టార్గెట్‌గా అనేక విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సోము ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు అయితే ఏపీలో టీడీపీ-బీజేపీ బంధం బ‌ల‌హీన‌ప‌డుతుంద‌ని భావిస్తోన్న చంద్ర‌బాబు కూడా త‌న వ‌ర్గం ద్వారా సోము వ్య‌తిరేకంగా లాబీయింగ్ చేయించిన‌ట్టు రూమ‌ర్ కూడా ఉంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా సోము వీర్రాజు మీదే మొగ్గు చూపుతున్నా వెంక‌య్య‌ను కాద‌న‌లేని ప‌రిస్థితి. ఏదేమైనా ఏపీ బీజేపీలో క‌మ్మ వ‌ర్సెస్ కాపు పోరు మాత్రం తీవ్రంగా జ‌రుగుతోంది. ఈ పోరులో ఫైన‌ల్‌గా ఏపీ బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఏ గ్రూపున‌కు ద‌క్కుతాయో చూడాలి.

,