బీజేపీని కుదిపేస్తున్న కన్నా వ్యవహారం       2018-05-19   08:55:59  IST  Bhanu C

బీజేపీకి వరుస వరుసాగా కంగారు పుట్టించే పరిణామాలే ఎదురవుతున్నాయి. ఒక వైపు కన్నడ రాజకీయాలతో బిజీగా ఉన్న ఆ పార్టీ అగ్ర నేతలకు ఏపీ పరిణామాలు మరో తలనొప్పిగా మారాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం జరిగిననాటి నుంచి ఆ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన నేతలను వదిలేసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్న కన్నాను ఎలా ఎంపిక చేస్తారని బీజేపీ అసమ్మతి నేతలు ప్రశ్నిస్తున్నారు. అదే అసమ్మతితో .. కొంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చేస్తుండగా… మరికొందరు మాత్రం లోలోపల మండిపడుతున్నారు. ఈ పరిస్థితి పశ్చిమగోదావరి నేతల్లో బాగా కనిపిస్తోంది.

ఏపీలో బీజేపీ ఒంటరి అయినప్పటి నుంచి ఆ పార్టీలో తరుచు ఏదో ఒక వివాదం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు ఉన్నంత కాలం బీజేపీ పరిస్థితి బాగానే ఉన్నట్టు కనిపించింది. ఆ రెండు పార్టీల మధ్య ఎప్పుడైతే చెడిందో.. అప్పటి నుంచి బీజేపీ అసలు రంగు బయటపడింది. దీనికి తోడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న ఆక్రోశం ప్రజల్లో బాగా పెరిగిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో కన్నాకు పదవి కట్టబెట్టి మిగిలిన బీజేపీ నేతల్లో అగ్గి రాజేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు చెందిన కొంతమంది బీజేపీ నేతలు రాజీనామాల బాట పట్టగా.. మరికొందరు లోలోపల మండిపోతున్నారట.

ముఖ్యంగా గోదావరి జిల్లాలకు చెందిన మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు, సోము వీర్రాజు పేర్లు మొదటి నుంచి వినిపించాయి. ఉభయగోదావరి జిల్లాలలో ఈ ఇద్దరు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. వీరిలో ఎవరో ఒకరికి ఛాన్స్ వస్తుందని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా పరిస్థితి మారడంతో నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

మాజీ మంత్రి మాణిక్యాలరావు వర్గం పూర్తిగా ఈ వ్యవహారంతో సైలెంట్ అయిపోయింది. ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకుంటూ, సర్దిచెప్పుకోవడం మొదలుపెట్టారు. కొందరు జిల్లాస్థాయి బీజేపీ నేతలకి అయితే కోపం మాములుగా లేదు. మనం అనుకున్నది ఒకటయితే, హైకమాండ్ మరో నిర్ణయం తీసుకోవడమేంటి? అని తప్పుపడుతున్నారు. ఇప్పుడు మేము సైలెంట్ గానే ఉంటాము కానీ ముందు ముందు మా తడాఖా ఏంటో చూపిస్తాం అంటూ హైకమాండ్ కి వార్ణింగ్ లు ఇస్తున్నారు…

అసలు బీజేపీలో ఇంకా సమర్థులైన నేతలు ఎవరూ కనిపించలేదా మీకు..? వైసీపీ కి వెళ్లిపోతున్నా నాయకుడిని తీసుకొచ్చి మా నెత్తి మీద ఎందుకు రుద్దారు అంటూ పశ్చిమ నేతలు బాహాటంగానే చెప్తున్నారు. కర్ణాటక హడావుడి అయిన వెంటనే అధిష్టానం దగ్గరే ఈ పంచాయితీ పెట్టి తాడో పేడో తేల్చుకోవాలని అసమ్మతి నేతలు చూస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఇంత హడావుడి చేసినా అమిత్ షా వంటి నేతలు దగ్గర వీరి పప్పులు ఉడుకుతాయా అనేది సందేహమే..!