కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభంతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు రికార్డు స్థాయి అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి, చైనా నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవడానికి అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలో 6 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు.నూతనంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధను పునర్నిర్మించడానికి ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
అయితే అధ్యక్షుడి వార్షిక బడ్జెట్‌ను కాంగ్రెస్ ఆమోదిస్తుంది.కానీ కాంగ్రెస్‌లో డెమొక్రాట్లకు, రిపబ్లికన్‌లకు సరిసమానమైన మెజారిటీ వుంది.
ప్రతినిధుల సభలో రిపబ్లికన్ మైనారిటీ నాయకుడు కెవిన్ మెక్‌కార్తీ మాట్లాడుతూ.తన జీవితంలో చూసిన అత్యంత బాధ్యతారహితమైన బడ్జెట్‌గా దీనిని అభివర్ణించారు.
అటు బైడెన్ మద్ధతుదారులు సైతం కోవిడ్ 19 షట్‌డౌన్ ప్రమాదాల బారినపడిన ఆర్ధిక వ్యవస్థ దీని వల్ల ద్రవ్యోల్బణంలోకి జారిపోయే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
చైనాతో అస్తిత్వ పోటీ అని చెప్పిన జో బైడెన్.
దానిలో ప్రభుత్వం, వ్యాపారం మధ్య సంబంధాన్ని పునరాలోచించాలన్న సంకల్పానికి ఈ భారీ ప్రణాళిక సంకేతమన్నారు.కాగా అమెరికా బడ్జెట్ అంచనాలు 2031లో 8.2 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఆర్ధిక వేత్తలు భావిస్తున్నారు.అయితే 6 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్‌లో సింహభాగం దేనికి కేటాయించాలో డెమొక్రాట్లు స్పష్టం చేశారు.ఇందులో 2.3 ట్రిలియన్ డాలర్ల (ఇది కాంగ్రెస్‌లో జరిగిన చర్చల సందర్భంగా 1.7 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది) ను మౌలిక సదుపాయాల కోసం ఉద్దేశించిన బిల్లుకు కేటాయించనున్నారు.మరో 1.8 ట్రిలియన్ డాలర్లను ఫెడరల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్య, సామాజిక సేవలకు కేటాయిస్తారు.21వ శతాబ్దంలో మెరుగైన శ్రామిక శక్తిని నిర్మించడంలో భాగంగా వీటికి రూపకల్పన చేసినట్లు బైడెన్ వెల్లడించారు.మొత్తంగా అమెరికాలోని మధ్య తరగతి వృద్ధి చెందడమే బడ్జెట్ అంచనా పెంపు లక్ష్యమని అధ్యక్షుడు తెలిపారు.
ఇక బడ్జెట్ ఆమోదం పొందుతుందా లేదా అన్నది చూస్తే.
మెమొరియల్ డే వీకెండ్‌కు ముందే ప్రభుత్వం బడ్జెట్‌ను కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టనుంది.ఎందుకంటే ఆ తర్వాత వారం రోజుల పాటు కాంగ్రెస్‌కు సెలవులు.
మరోవైపు మెజారిటీ డెమొక్రాట్లు అధ్యక్షుడు బైడెన్.కాంగ్రెస్‌ను అదుపులో వుంచేందుకు గాను ఓ చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నారు.
ఎందుకంటే రిపబ్లికన్ సభ్యులు అధ్యక్షుడు ప్రతిపాదించే అంశాల్లో చాలా వరకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఉదాహరణకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో కార్పోరేట్ పన్నును తగ్గించాలని రిపబ్లికన్లు చేసిన చట్టాన్ని రద్దు చేయాలని బైడెన్ భావిస్తున్నారు.తద్వారా అధిక ఆదాయాన్ని సేకరించాలన్నది ఆయన యోచన.అయితే రిపబ్లికన్లు దీనిని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు.
ఇప్పటికే బడ్జెట్‌లో ఖర్చు చేయని డబ్బును తిరిగి కేటాయించడం ద్వారా మౌలిక సదుపాయాలకు వెచ్చించవచ్చని రిపబ్లికన్ల వాదన. సీనియర్ రిపబ్లికన్ సెనేటర్ మిచ్ మెక్ కొన్నెల్ మాట్లాడుతూ.
బైడెన్ ప్రతిపాదన అమెరికన్ కుటుంబాలను అప్పులు, ద్రవ్యోల్బణంలో ముంచివేస్తుందని అభిప్రాయపడ్డారు.ప్రతిష్టంభన ఉన్నప్పటికీ.
బైడెన్ మెగా బడ్జెట్ స్వల్ప మెజారిటీతో నెగ్గించుకునే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు.బలాబలాలు సరిసమానంగా వున్న కాంగ్రెస్‌లో బైడెన్‌కు కనీసం 10 మంది రిపబ్లికన్ల మద్ధతు అవసరం.