2019 వార్‌... ఏపీలో పోటీపై ప‌వ‌న్ మార్క్ ట్విస్ట్‌       2018-05-01   21:28:46  IST  Bhanu C

శ్రీ‌రెడ్డి సుడిగాలిలో చిక్కుకున్న ప‌వ‌నాలు ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ ఏపీ ఎపిసోడ్‌లోకి వ‌చ్చారు. వినాయ‌కుడి పెళ్లి ఎప్పుడంటే.. రోజూ రేపే.. అన్న‌చందంగా జ‌న‌సేన అధినేత‌ త‌న కార్యాచ‌ర‌ణ వెల్ల‌డికి మ‌ళ్లీ డేట్ పెట్టారు. గ‌తంలో కూడా తెలంగాణ‌లోని క‌రీంనగ‌ర్ జిల్లా కొండ‌గ‌ట్టు నుంచి ప్ర‌జాయాత్ర ప్రారంభించిన ఆయ‌న ఆగుతూ సాగుతూ ముందుకు క‌దిలారు. రాజ‌కీయంగా త‌న ప్ర‌ణాళిక‌, కార్యాచ‌ర‌ణ విష‌యంలో మాత్రం ఇప్ప‌టికీ క్లారిటీ ఇవ్వ‌లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీలో రాజ‌కీయంగా నెల‌కొన్న అత్యంత క్లిష్ట ప‌రిస్థితులు ప‌వ‌న్‌ను మ‌రింత అయోమ‌యానికి గురిచేశాయి. ఇక‌ గుంటూరులో నిర్వ‌హించిన స‌భ‌లోనైనా పార్టీ ప్ర‌ణాళికా, కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తార‌ని ఎదురుచూసిన క్యాడ‌ర్‌కు నిరాశే మిగిలింది. స‌భ‌కు ముందు త‌న కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం వ‌ర‌కే ప‌రిమితం అయ్యారు.

తాజాగా.. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ఏపీలోని 13 జిల్లాల‌కు చెందిన పార్టీ ముఖ్య‌కార్త‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మ‌ళ్లీ కార్యాచ‌ర‌ణ వెల్ల‌డికి టైం పెట్టారు. ఈ నెల11వ తేదీలోగా తన పర్యటన షెడ్యూల్ ఖరారు కానుందని తెలిపారు. ఇక ఆగ‌స్టు రెండో వారం నాటికి తెలంగాణ‌లో పోటీకి సంబంధించి ప్రాథ‌మిక ప్ర‌ణాళిక ప్ర‌టిస్తామ‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లుపై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ త్వ‌ర‌లో ప్ర‌జ‌ల ముందుకువెళ్తామ‌ని రోటీన్ డైలాగ్ చెప్పారు. ప‌క్కా ఎన్నిక‌ల వ్యూహంతో ముందుకు వెళ్దామ‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కూ ప్ర‌ణాళికాబ‌ద్ధంగా అడుగులు వేద్దామ‌ని ఆయ‌న సూచించారు.

అయితే ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌తో ఓ విష‌యంలో మాత్రం క్లారిటీ వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే జ‌న‌సేన పార్టీ బ‌రిలోకి దిగ‌నుంది. ఏ పార్టీతోనూ పొత్తులుండ‌వ‌ని తేలిపోయింది. ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధ‌మ‌ని పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో భాగంగా ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వామ‌ప‌క్షాల‌తో క‌లిసి పాద‌యాత్ర చేప‌ట్టారు. వామ‌ప‌క్ష నేత‌ల‌తో క‌లిసి స‌మావేశాలు నిర్వ‌హించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీపీఐ, సీపీఎంల‌తో క‌లిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌డుస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ. తాజాగా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌తో వామ‌ప‌క్ష నేత‌ల‌కు షాక్ ఇచ్చారు. హీరో ఇమేజ్‌తోనైనా తాము పుంజుకోవ‌చ్చున‌ని భావించిన ఆ నేత‌ల‌కు ఇప్పుడు ప‌వ‌న్‌మాట‌లు అస్స‌లు రుచించ‌డ‌డం లేదుకావొచ్చు. దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలిమ‌రి.

ఇదే స‌మ‌యంలో పార్టీ రాజ‌కీయ వ్యూహ క‌ర్త‌గా దేవ్‌ను ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ నియ‌మించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త దేవ్‌ను కార్య‌క‌ర్త‌ల‌కు ప‌రిచ‌యం చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే కాదు ఎన్నిక‌ల త‌ర్వాత కూడా దేవ్ సేవ‌ల‌ను వినియోగించుకుంటామ‌ని ప‌వ‌న్ చెప్పారు. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు అనుభ‌వం లేద‌న్న ప్ర‌త్య‌ర్థుల మాట‌ల్ని ప‌వ‌న్ కొట్టిపారేశారు. గత రెండు ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు పనిచేశారని..ఈ అనుభవం వచ్చే ఎన్నికల్లో బరిలోకి నిలిచేందుకు సరిపోతుందని అన్నారు. అయితే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా దేవ్ జ‌న‌సేన పార్టీకి విజ‌య‌వంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తారో లేదో తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే.

ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు రాజకీయాలు కొద్ది మంది, కొన్ని కుటుంబాల చేతుల్లో ఉండటం వల్ల ప్రజలకు జరగాల్సిన న్యాయం జరగటంలేదన్నారు. కులాల ఐక్యత జనసేన సిద్ధాంతం అని తెలిపారు. ఒక కులానికి మరో కులం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప‌వ‌న్ కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారంటూ ప్ర‌చారం చేస్తూ, ఇత‌ర వ‌ర్గాల‌కు దూరం చేయ‌డానికి కొంద‌రు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని ఇటీవ‌ల సినీరంగానికి చెందిన ప్ర‌ముఖుడు న‌ట్టికుమార్ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన‌ప్పుడు కూడా చిరంజీవిపై ఇలాంటి ప్ర‌చార‌మే చేశార‌నీ, ఇప్పుడు ప‌వ‌న్‌పై కూడా ఇదే చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పై వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. తాను కాపు వ‌ర్గానికి చెందిన వాడినే కాద‌నీ, తాను అంద‌రివాడిన‌నే సంకేతాల్ని ప‌వ‌న్ ప‌దేప‌దే ఇస్తున్నారు.