నాయకుల కోసం నాయకుడు ఎదురుచూపు       2018-07-05   02:07:17  IST  Bhanu C

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో నాయకుడు కనిపిస్తున్నాడు కానీ నాయకులే పెద్దగా కనిపించడంలేదు. విశాఖలో దాడి వీరభద్రరావు వంటి సీనియర్ నాయకుడు చేరినా పవన్ కళ్యాణ్ వారిని ఇంటికి వెళ్లి మరీ బతిమాలాడడం .. ఆలోచించి చెప్తాను అని ఆయన అనడం పవన్ స్థాయిని దిగజార్చే అంశాలే. ఇక ఆయన తప్ప పెద్దగా రాజకీయాల్లో ఆరితేరిన వారు ఆ పార్టీలో కనిపించడంలేదు. జనసేనలోకి ఇతర పార్టీల నుంచి నాయకులు క్యూ కట్టేస్తారనుకుంటే వాస్తవంలో మాత్రం అలా జరగడంలేదు. ఒక పక్క చూస్తే ఎన్నికల సమయం ముంచుకొచ్చేస్తోంది. అందుకే పేరున్న నాయకులు ఎవరైనా పార్టీలో చేరతారేమో అని పవన్ ఎదురుచూడాల్సి వస్తోంది.

ఎన్నికల్లో పోటీ చేయడానికి కాదు ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించాడు. ఆ తరువాత ఇంకా నమ్మకం పెరిగిందో ఏమో కానీ సీఎం అవుతా నన్ను ఆశీర్వదించండి అంటూ పెద్ద కోరికలే కోరాడు. ప‌వ‌న్ పాద‌యాత్ర‌లు జ‌రిగే స‌మ‌యంలో వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు భారీగా జ‌న‌సేన‌లోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కాని అలా జరగలేదు. దీంతో అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. పవన్ కల్యాణ్ తప్ప ఆ పార్టీలో చెప్పుకోదగ్గ నాయకుడు ఒక్కరు కూడా లేరని విమర్శలు వస్తుండటంతో వారు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.

‘ప్రజలే నన్ను నడిపించే నాయకులు, నా వెంట వారుంటే చాలు’ అని బయటకి చెప్పుకుంటున్నా … తెలుగుదేశం, వైసీపీలతో పాటు రాష్ట్రంలో ఇంకా అనేక మంది మేధావులు, జనంలో బలం ఉన్న ప్రముఖులు తమతో టచ్ లో ఉన్నారని, వారంతా తమ పార్టీలో వచ్చి చేరుతారని అడిగిన వారికి చెప్పుకుంటూ వస్తున్నారు.
జనసేన పార్టీలో ఉన్న ప్రముఖ నాయకులు ఎవరు అంటే.. పవన్ పేరు తప్ప మరో పేరు ఎవ్వరికీ గుర్తుకురాదు. తెలుగుదేశం నుంచి మంత్రి స్థాయిలోని అనేక మంది నాయకులు కూడా ఎగబడి వచ్చి జనసేనలో చేరిపోబోతున్నట్లుగా జనసేన లీకులిస్తోంది.