ఉభయగోదావరి జిల్లాల్లో ఈ రోజు జనసైనికుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది.ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నరసాపురం లో మత్స్యకార సభ ఏర్పాటు చేయడం, 3 గంటల పాటు ఆ సభలో మాట్లాడబోతూ ఉండడంతో, పవన్ రాక కోసం జనసైనికులు ఎదురు చూపులు చూస్తున్నారు.
ఈరోజు ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పవన్ నరసాపురం సభకు వెళ్తారు.దీంతో ఉభయగోదావరి జిల్లాలతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనసైనికులు నరసాపురం చేరుకున్నారు.
ఎక్కడ చూసినా ఒకటే సందడి ప్రస్తుతం కనిపిస్తోంది.
చాలా కాలంగా పవన్ బహిరంగ సభలు, సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇప్పుడు సొంత జిల్లాలో సభను ఏర్పాటు చేయబోతున్న తరుణంలో పవన్ ను చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు భారీ స్థాయిలో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ అభిమానులు నర్సాపురం చేరుకున్నారు.వాస్తవంగా పవన్ మత్స్యకార సభను ఎప్పుడో ఏర్పాటు చేయాల్సి ఉన్నా, వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది.
దీంతో ఈరోజు ఆ సభను ఏర్పాటు చేశారు.
ఈ సభ ద్వారా ఏపీ అధికార పార్టీ వైసీపీ ని పూర్తిగా టార్గెట్ చేసుకుని పవన్ విమర్శలు చేసే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే పవన్ నరసాపురం సభ పై రాజకీయంగా అనేక విశ్లేషణలు జరుగుతున్నాయి.ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పదవికి రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.
ఆయన ముఖ్యంగా జనసేన మద్దతును కోరుకుంటున్నారు .ఆ పార్టీ సహకారం ఉంటే తాను తప్పకుండా మళ్లీ ఎంపీగా గెలుస్తాను అని నమ్ముతున్నారు.దీంతో పవన్ ఇప్పుడు అదే నరసాపురం లో సమావేశం ఏర్పాటు చేస్తుండడంతో మరింత అనుమానాలు కలుగుతున్నాయి.