ప్రస్తుతం ఏపీలో తన రాజకీయ అదృష్టం పరీక్షించుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు 2019 ఎన్నికల్లో కేవలం ఒక స్థానంలో మాత్రమే జనసేన గెలవడంతో, 2024 ఎన్నికల్లో జనసేన ను కీలకం చేయాలని చూస్తున్నారు.సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా, ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న తమ మద్దతు అవసరం అయ్యే విధంగా అయినా సీట్లు గెలుచుకుంటాము అనే ధీమాలో పవన్ ఉన్నారు.
దీని కోసం పార్టీలో సంస్థాగత నిర్మాణం పైన దృష్టి పెట్టారు.తెలంగాణలో జనసేన ఉన్నా, లేనట్టుగానే ఉంది.
అయినా జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన కొంత మంది అభ్యర్థులను ప్రకటించినా, ఆ తర్వాత పూర్తిగా రాజకీయ కార్యకలాపాలు తెలంగాణలో చోటు చేసుకోకపోవడంతో… తెలంగాణలో పార్టీ సంగతి పవన్ పక్కన పెట్టేసినట్టే అని అంతా ఒక అభిప్రాయానికి వచ్చేశారు.
దీనికి తగ్గట్లుగానే రాజకీయ పార్టీని నడపాలంటే చాలా ఆర్థిక శక్తి అవసరమని, అది తన వద్ద లేనందునే తెలంగాణలో పార్టీని నడపడం కుదరడం లేదు అంటూ ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు.
అయినా పవన్ అభిమానులు మాత్రం జనసేన తరపున అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు.ఇక తమ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కి పవన్ అండగా ఉంటున్నారా అంటే అదీ లేదు.
అంతే కాకుండా తెలంగాణ బీజేపీ నాయకులు జనసేన విషయంలో చులకనగా కామెంట్స్ చేశారు.ఈ సంగతి ఇలా ఉంటే , ఇప్పుడు తెలంగాణా లో పవన్ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ఈ మేరకు అనుస్టుమ్ నరసింహ యాత్ర పేరుతో తెలంగాణలో పర్యటించేందుకు పవన్ సిద్ధమయ్యారు.
కొండగుట్ట ఆంజనేయస్వామి దర్శించుకుని ఆ తరువాత వరుసగా నరసింహ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర పవన్ చేపట్టబోతున్నారు.అయితే ఇది ఆధ్యాత్మిక యాత్ర కాదని, పూర్తిగా రాజకీయ యాత్ర అని, అసలు తెలంగాణలో తమ పార్టీకి ఏ మాత్రం బలం ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు తన అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని రాజకీయంగా చూపించి బీజేపీకి తన స్థాయి ఏమిటో తెలియజెప్పాలనే ఉద్దేశంతో పవన్ ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.