చిత్రం : జక్కన్న
బ్యానర్ : ఆర్ పీ ఏ ప్రొడక్షన్స్
దర్శకత్వం : వంశీకృష్ణ ఆకెళ్ళ
నిర్మాత : సుదర్శన్ రెడ్డి
సంగీతం : ఆర్ పీ అక్షిత్
విడుదల తేది : జులై 29, 2016
నటీనటులు : సునీల్, మన్నారా చోప్రా, కబీర్ సింగ్ తదితరులు
కామెడియన్ నుంచి హీరో అవతారమెత్తి, అందాల రాముడు, మర్యాద రామన్న వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన సునీల్, ఆ తరువాత వరుస అపజయాలతో వచ్చిన మార్కేట్ ని పోగొట్టుకున్నాడు.మంచి అంచనాల మధ్య విడుదలైన గత చిత్రం కృష్ణాష్టమి కూడా భారి ఫ్లాప్ గా నిలిచింది.
మరి దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ జక్కన్న రూపంలో సునీల్ కి అవసరమైన సినిమాని ఇవ్వగలిగాడో లేదో చూద్దాం.
కథలోకి వెళ్తే …
గణేష్ (సునీల్) ది ఒక వింత వ్యక్తిత్వం.
సహాయం చేయాలి అనేది తన గుణమైతే, అతిగా సహాయం చేయడం తనకున్న మైనస్ పాయింట్.ఈ ఓవర్ హెల్పింగ్ నేచర్ వల్లే ఒక గ్యాంగ్ స్టర్ బైరాగి (కబీర్ సింగ్)కి తాసరపడతాడు గణేష్.
ఇక అతనికో లవ్ స్టోరి కూడా ఉంటుంది.
తన ఓవర్ హెల్పింగ్ నేచర్ వలన గణేష్ జీవితంలో వచ్చిన మార్పులేంటి, అతడికి బైరాగికి మధ్య చోటుచేసుకున్న సంఘటనలేంటి అనేది మిగితా కథ.
నటీనటుల నటన గురించి
ఈమధ్యకాలంలో సునీల్ సినిమాల్లో వినోదం పాళ్ళు తగ్గుతున్నాయని విమర్శలు బాగా వచ్చాయి.వాటిని చెవినపెట్టుకున్న సునీల్, తన పాత కామెడి టైమింగ్ ని తిరిగి తెరపై చూపించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు.
ఈ ప్రయత్నంలో చాలావరకు సఫలీకృతం అయ్యాడనే చెప్పాలి.ఓవర్ హెల్పింగ్ నేచర్ తో సునీల్ ఫర్వాలేదనిపించే కామెడి పండించాడు.
మన్నారా చోప్రా సినిమా మొత్తం నటించడానికి విఫలయత్నాలు చేసింది.గ్లామర్ బొమ్మగా మాత్రమే చూడాలన్నా కష్టమే.
బాలివుడ్ నుంచి వచ్చి కూడా బాడి షేప్ గురించి సరిగా పట్టించుకోకపోవడం విడ్డూరం.కబీర్ సింగ్ ఒకే అన్నట్టు ఉన్నాడు.
కామేడియన్ బ్యాచ్ లో పృధ్విరాజ్ ఎప్పటిలానే మెరిస్తే, సప్తగిరి కొన్ని చమక్కులు వదిలాడు.
సాంకేతికవర్గం పనితీరు
దినేష్ అందించిన సంగీతం ఫర్వాలేదు.
సునీల్ డ్యాన్సుల కోసం తన మ్యూజిక్ తో చాలా స్పేస్ ఇచ్చాడు.కమర్షియల్ సినిమాలకి ఇలాంటివి తప్పవు.
ఎడిటర్ గా ఎమ్ ఆర్ వర్మ మార్కు అంతంతమాత్రమే.సినిమా సెకండాఫ్ లో చాలా ఎపిసోడ్లు విసుగు పుట్టిస్తాయి.
ఈ సన్నివేశాలు అలానే ఉంచేయడం, దర్శకుడు, ఎడిటర్ .ఇద్దరి తప్పు.రామ్ ప్రసాద్ కెమెరా పనితం బానే ఉంది.పాటల చిత్రీకరణలో కెమెరామెన్ పెట్టిన ఎఫర్ట్స్ కుడా ఓకే.
ఇక వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకునిగా చాలా సేఫ్ వెళ్ళడానికి ప్రయత్నించాడు.సినిమాలో చెప్పుకోవడానికి కథేమి లేదు.
హీరోకి ఇచ్చిన పాత్రస్వభావం బాగున్నా, ఇరికించిన అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ వలన మంచి కామెడి క్లాసిక్ మిస్ చేసాడు అనిపిస్తుంది.
విశ్లేషణ
హీరో పాత్ర తీరుతెన్నులు కొత్తగా ఉన్నాయి ఒకే.దాంతో మీరు సినిమా కూడా కొత్తగా ఉంటుంది అని ఊహించుకుంటే నిరాశపడతారు.మళ్ళీ మూస మొదలు.
హీరో ఇంట్రోడక్షన్ … ఓ పాట.గ్లామరస్ గా హీరోయిన్ ఇంట్రోడక్షన్.చూడగానే హీరోగారికి లవ్ పుట్టేయడం.స్టయిలిష్ విలన్ ఇంట్రోడక్షన్.ఆ తరువాత ఒకరి తరువాత ఒకరు వచ్చి బ్యాటింగ్ చేసినట్టు, కామెడిన్ బ్యాచ్ అంతా దిగిపోయి మనల్ని నవ్వించడానికి అష్టకష్టాలు పడతారు.ఇంటర్వల్ దగ్గరిదాకా వస్తేకాని కథ మొదలుకాదు.
ఎన్ని తెలుగు సినిమాలు వచ్చాయో ఇలా.అలాంటి ఫక్తు రొటీన్ సినిమానే ఈ జక్కన్న.
సునీల్ డ్యాన్సులు బాగున్నాయి.బి,సి సెంటర్స్ లో జనాల్ని ఆకట్టుకుంటాయి.మిగితా చిన్నసినిమాలు ఆధారపడినట్టే కామెడియన్ పృథ్వీరాజ్ టైమింగ్ మీద మళ్ళీ ఆధారపడ్డారు.విసుగుపుడుతున్న దశలో పృథ్వీ ఓ చిన్న ఉపశమనం.
ఓవరాల్ గా అక్కడక్కడ నవ్వుకోవడానికి పనికొస్తుంది జక్కన్న.
హైలైట్స్ :
* సునీల్
* 30 ఇయర్స్ పృథ్వీ
* కొన్ని కామెడి సీన్స్
డ్రాబ్యాక్స్ :
* కథ
* మూస స్క్రీన్ ప్లే
* సెకండాఫ్
* హీరో హీరోయిన్ మధ్య కరువైన కెమిస్ట్రీ
* ఎడిటింగ్
చివరగా :
జక్కన్న … కొత్తగా ఏమి లేదన్న