బాబుకు జ‌గ‌న్ అదిరిపోయే స‌ల‌హా..!     2018-04-25   00:49:39  IST  Bhanu C

-

-

సీఎం చంద్ర‌బాబుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ అదిరిపోయే స‌ల‌హా ఒక‌టి పారేశారు. ఆయ‌న చేస్తున్న పాల‌న‌పై రాష్ట్రం లోని ప్ర‌జానీకం ముఖ్యంగా మ‌హిళ‌లు క‌న్నీరు కారుస్తున్నారంటూ.. జ‌గ‌న్ నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుతం ప్ర‌జాసంక‌ల్ప పాద యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌.. బాబు ప్ర‌భుత్వం పాల‌న‌పై మండిప‌డుతున్నారు. త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న నిప్పులు చెరుగు తున్నారు. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని చెబుతూ.. చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను చెండుకు తింటున్నాడ‌ని, ఇదేనా అనుభ‌వ‌మ‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. పాల‌న విష‌యంలో ముఖ్యంగా రాష్ట్ర మ‌హిళ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసి బాబు ఎంతో నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జ‌గ‌న్ హిత‌వు ప‌లుకుతున్నారు.

త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోరుతూ.. రాష్ట్రంలోని అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు చేసిన ఆందోళ‌న‌ను ప్ర‌భుత్వం ఉక్కుపా దంతో అణిచి వేయ‌డ‌న్నా జ‌గ‌న్ ప్ర‌శ్నించాడు. అంగన్వాడీ వర్కర్లపై లాఠీచార్జ్ ని ఖండించారు. మహిళలపై దాడి చేయడం అమానుషమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని విధానాల్లో డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తోందని మండిపడ్డారు. ఓ వైపు మహిళా సాధికారత అని మాట్లాడుతూ..మహిళలపై దాడి చేయడం అమానుషమని నిప్పులు చెరిగాడు. విజయనగరం కలెక్టరేట్ వద్ద తమ హక్కుల సాధనకు అంగన్వాడీ వర్కర్లు శాంతియుతంగా ఆందోళన చేస్తుండగా వారిపై పోలీసులు లాఠీచార్జీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల వైఎస్ జగన్ మండిపడ్డాడు

ప్రభుత్వం తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచారని ఏపీలో పెంచకపోవడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చంద్రబాబును వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. ఇప్పటికే పార్టీ తరఫున ప్రకటించిన నవరత్నాల్లో అంగన్వాడీల సంక్షేమం కోసం కూడా వైసీపీ పలు నిర్ణయాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు అంగన్వాడీల సంక్షేమం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక రీతిలో వ్యవహరించారనే అభిప్రాయం ఉంది.
చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా…అంగన్ వాడీ కార్యకర్తలను ముఖ్యమంత్రి నివాసానికి ఆహ్వానించిన కేసీఆర్ వారితో దాదాపు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి భోజన ఏర్పాట్లు కూడా చేసి అనంతరం వారితో మాట్లాడుతూ అంగన్ వాడీల సంక్షేమానికి పలు నిర్ణయాలు ప్రకటించారు. ఇప్పుడు దీనినే జ‌గ‌న్ అస్త్రంగా చేసుకుని బాబుకు విరుచుప‌డ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి బాబు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.