ఇంటాబయటా వైసిపి అధినేత జగన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిన జగన్ , వాటి అమలు బాధ్యత పూర్తిగా అధికారులపైనే పెట్టారు.ఇక లక్షలాదిగా భర్తీ చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.2019 ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో హామీలను జగన్ ప్రకటించారు .జగన్ హామీలు జనాల్లోకి బాగానే వెళ్లాయి.అయితే వాటిని వెంటనే అమలుచేయరని, ఐదేళ్ళ కాలం పాటు సాగదీస్తారు అని అందరూ ఊహించినా, జగన్ మాత్రం అందుకు భిన్నంగా, అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేసి తన సత్తా నిరూపించుకున్నాడు.
అయితే జగన్ ఇంత భారీ భారీ పథకాలను ప్రకటించడం వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన సలహాలు, సూచనలు ఎన్నికలకు ముందు జగన్ తీసుకుని ఆ విధంగా నడుచుకున్నారు.
ఎన్నికల మేనిఫెస్టోను సైతం ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో తయారు చేశారు. ఆ వ్యూహాలు బాగా పనిచేసి వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేశాయి .అయితే ప్రశాంత్ కిషోర్ రూపొందించిన పథకాలు అన్నీ భారీ బడ్జెట్ తో కూడుకున్నవి కావడం, వాటిని అమలు చేసే విషయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు మధ్యలో ఆగిపోకుండా, చేయడం జగన్ కు తలకు మించిన భారంగా తయారైంది .సంక్షేమ పథకాల నిర్వహణ కోసం ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.అయితే ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంతో, అప్పులతో నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.దీని కారణంగా జనాలలోను అభాసుపాలు అవుతున్నామనే అభిప్రాయం వైసీపీలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

దీనికి తోడు కేంద్రం సహకారం అంతంతమాత్రంగానే ఉండడం, కొత్త అప్పులు చేసేందుకు అడ్డు పడుతుండటం, ఇవన్నీ జగన్ కు కొత్త తలపోటు తీసుకు వస్తున్నాయి.ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ సూచనలతో అమలు చేసిన ఈ పథకాలకు కావాల్సిన నిధులను ఎలా సమకూర్చుకోవాలనే విషయంలో ప్రశాంత్ కిషోర్ ఎటువంటి సలహాలు ఇవ్వకపోవడంతో, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా , ఆదాయ మార్గాలను పెంచుకునే విషయంలో ప్రశాంత్ కిషోర్ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేలా జగన్ ఒప్పిస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు వైసీపీ నాయకుల్లో నే వ్యక్తం అవుతున్నాయి.