బాబు `ప‌వ‌ర్‌` ఏంటో ఇప్ప‌టికి తెలిసొచ్చిందా?!       2018-06-14   23:03:50  IST  Bhanu C

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌వ‌ర్‌.. ఏంటో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీకి ఇప్ప‌టికి కానీ తెలిసిరాలేదా? మ‌రో ప‌ది మాసాల్లో ఎన్నిక‌లు పెట్టుకుని.. ఇప్ప‌టికిప్పుడు బాబును ఓడించే తంత్రాల కోసం వెతుకుతోందా? అంటే ఔన‌నే స‌మాధానమే వ‌స్తోంది తాజా ప‌రిణామాల నుంచి! “బాబును ఓడించ‌డం చిన్న విష‌యం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న‌దే రాజ్యం!“- అని.. విజ‌య‌వాడ‌లో ఏడాదిన్న‌ర కింద‌ట జ‌రిగిన వైసీపీ ప్లీన‌రీ సంద‌ర్భంగా ఆ పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ఇంకా ప్ర‌జ‌ల చెవుల్లో వినిపిస్తూనే ఉంది. ఆ త‌ర్వాత చంద్ర‌బాబే ల‌క్ష్యంగా జ‌గ‌న్ చేసిన వ్య‌తిరేక పోరాటాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.

అయితే, ఇవేవీ.. ఈ వ్యూహాలేవీ.. కూడా చంద్ర‌బాబును గ‌ద్దె దింపేందుకు కానీ, బాబును ఎదుర్కొనేవిగా కానీ, జగ‌న్‌కు స‌పోర్టు ఇవ్వ‌డం లేద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ అవిశ్రాంత పోరాటానికి తెర‌దీశారు. గ‌త ఏడాది న‌వంబ‌రులో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో 3000 కిలో మీట‌ర్ల పాద‌యాత్ర‌ను ఎంచుకున్నారు. ఇది అప్ర‌తిహ‌తంగా సాగుతోంది. వీటికితోడు స‌ర్వేలు, హామీలు, న‌వ‌ర‌త్నా లు వంటివి అనేకం ఉన్నాయి. అయితే, ఇవేవీ.. కూడా బాబును ఓడించ‌గ‌లిగేవి కావ‌నే విష‌యం.. జ‌గ‌న్‌కు ఇప్ప‌టికికానీ అర్ధం కాలేదు. అందుకే ఆయ‌న.. ఇప్పుడు బాబుపై పోరాడేందుకు ఆయ‌న‌ను వ్య‌తిరేకించేవారిని కూడ‌గ‌డుతున్నారు.

ఒంట‌రిగా పోరాడి.. బాబును ఓడిస్తాన‌న్న నోటితోనే బాబును వ్య‌తిరేకించే వారిని కూడ‌గ‌ట్టి.. ముందుకు వెళ్తామ‌ని తాజాగా వైసీపీ అధికార ప్ర‌తినిధి , ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న పైకి బాగానే ఉంద‌ని అనుకున్న‌ప్ప‌టికీ.. బాబు బ‌లం ఏరేంజ్‌లో ఉందో స్ప‌ష్టం చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి 2014కు ముందు, ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాల‌ను అంచ‌నా వేసుకుంటే.. చంద్ర‌బాబు కానీ, ఆయ‌న పార్టీ ప‌రిస్థితి కానీ.. నూటికి రెండు వంద‌ల శాతం పుంజుకుంది. ప్ర‌భుత్వ ప‌రంగా ప్రారంభించిన ప‌థ‌కాలు, వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మా లు, ప‌లు కార్పొరేష‌న్ల ఏర్పాటు వంటివి ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబు ఇమేజ్‌ను భారీ రేంజ్‌లో పెంచాయి.

అదే స‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున కూడా చంద్ర‌బాబు ప‌లు రూపాల్లో నాయ‌కులు, ఎమ్మెల్యేల ప‌రిస్థితిపై స‌ర్వేలు చేయించారు. ఆయా స‌ర్వేల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఆధారంగా నాయ‌కుల ప‌నితీరును మ‌దింపు వేసి.. ప్ర‌జ‌ల్లో మ‌రింత పేరు తెచ్చుకునేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఫ‌లితంగా నాయ‌కుల ప‌నితీరు మెరుగుప‌డి.. పార్టీ గ్రాఫ్ పెరిగింది. దీంతో గ‌డిచిన మూడేళ్ల నాటి పార్టీ ప‌రిస్థితికి, ఇప్ప‌టికీ కూడా ఎంతో మార్పు క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌.. ఇక‌, తాను ఒంట‌రిగా బాబును ఎదుర్కోవ‌డం క‌ల్లేన‌ని భావించి ఉంటార‌నే వ్యాఖ్య‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మొత్తంగా ఇప్ప‌టికి కానీ.. జ‌గ‌న్‌కు బాబు `ప‌వ‌ర్‌` ఏంటో అర్ధం కాలేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.