రాజకీయాలు అంటే కులం మతం ఆధారంగానే నడుస్తాయనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.రాజకీయాలలో కులం మతం అనేది అంతగా పెనవేసుకుపోయాయి.
కులాల బలం ఎవరికి ఎక్కువగా ఉంటే, వారికే విజయం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.ఇది కేవలం ఒక రాష్ట్రంలోనే కాదు దేశమంతా ఇదే పరిస్థితి నెలకొంది.
కులాలకు, మతాలకు అతీతంగా రాజకీయం చేద్దామంటే ప్రస్తుత పరిస్థితుల్లో కుదరని పనే అన్నట్టుగా చెప్పుకోవాలి.ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీ విషయానికి వస్తే, అన్ని కులాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు వ్యవహరిస్తూ వస్తోంది.
అన్ని సామాజికవర్గాల్లో పట్టు సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తూ, కులాల ఆధారంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, కులానికో కార్పొరేషన్ ప్రకటించి, వాటికి పదవులు, నిధులు కేటాయించి జగన్ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నారు.కాపులకూ అంతే స్థాయిలో ప్రాధాన్యం కల్పించారు.అయినా ప్రస్తుతం జరిగిన పంచాయతీ ఎన్నికలలో టిడిపి, అధికార పార్టీ వైసీపీ కంటే జనసేన వైపు కాపులు మొగ్గు చూపారనే విషయం స్పష్టంగా అర్థమైంది.
2019 ఎన్నికలలో కాపులు జనసేన కంటే ఎక్కువగా జగన్ ను నమ్మారు.కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేమని జగన్ ప్రకటించినా, ఆయన వైపు నిలబడ్డారు.అయితే క్రమక్రమంగా కాపుల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చినట్లు ఈ పంచాయతీ ఎన్నికలు నిరూపించాయి.ఒకవైపు జనసేన, మరోవైపు బిజెపి కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధంగా వ్యవహరించడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ సామాజిక వర్గంను మరింత దగ్గర చేసుకునే విధంగా ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తున్న తీరు , యువత, సినీ అభిమానులు ఎక్కువగా జనసేన వైపు నిలబడడం వంటి కారణాలతో అనూహ్యంగా కాపు ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో జనసేనకి అనుకూలంగా పంచాయతీ ఫలితాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఇక తాము కాపుల కోసం ఎంతగా ప్రయాసపడినా, ఆ సామాజిక వర్గంకు చెందిన మెజారిటీ ఓటర్లు జనసేన వైపే నిలబడతారని, కాపులను ఎక్కువగా నమ్ముకునే కంటే, బీసీ సామాజిక వర్గాలను మరింత దగ్గర చేసుకుని పూర్తిగా వారిని దగ్గర చేసుకోవాలనే ఆలోచనతో జగన్ ఉన్నారట.అసలు మొదటి నుంచి బీసీ సామాజికవర్గం పేరు చెబితే తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలబడేవారు.బీసీల పార్టీగా తెలుగుదేశం ముద్ర వేయించుకుంది.
కానీ 2019 ఎన్నికలలో బీసీలు జగన్ వైపు నిలబడడంతో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది.
టిడిపి ప్రతిపక్షంలో వెళ్ళినప్పటి నుంచి బీసీల పార్టీగా మళ్లీ పునర్వైభవం తెచ్చుకునేందుకు, పార్టీ పదవుల్లో వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.
అయితే ఇక టీడీపీకి అవకాశం లేకుండా బీసీలకు మరిన్ని వరాల జల్లు కురిపించి, టిడిపికి వారిని మరింత దూరం చేయాలనే ఆలోచనకు జగన్ వచ్చారట.కాపులు జనసేన వైపు వెళ్లినా, పూర్తిగా బీసీల మద్దతు తమకు ఉంటే, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మద్దతుతో సులువుగా గట్టెక్కవచ్చు అనే ఆలోచనతో జగన్ ఉన్నరట.
అదే జరిగితే టీడీపి అన్ని విధాలుగా నష్టపోయే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.