కేసీఆర్ ఆ ప‌వ‌ర్‌ను కేటీఆర్‌కే ఇచ్చారా..       2018-07-03   23:54:49  IST  Bhanu C

గులాబీ గూటిలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంటుందా..? టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆ ప‌వ‌ర్‌ను త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌కే అప్ప‌గించారా..? ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మా..? మ‌ంత్రి హ‌రీశ్‌రావు వ‌ర్గానికి చెక్ పెట్ట‌డ‌డ‌మే ఇందులో ఆంత‌ర్య‌మా..? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ముంద‌స్తు ఎన్నిల‌కు వెళ్దామా..? అంటూ ప్ర‌తిప‌క్షాల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌వాల్ విసిరిన కొద్దిరోజుల‌కే కేటీఆర్ ఆ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు గులాబీ గూటిలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ మొద‌లైంది.

త‌మ భ‌విష్య‌త్ ఏమ‌వుతుందోన‌నే ఆంద‌ళ‌న‌తో కొంద‌రు నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతుండ‌గా… మరికొంద‌రు మాత్రం ఇక త‌మ‌కు తిరుగే ఉండ‌దులే.. అని అనుకుంటున్నార‌ట‌. గులాబీ గూటిలో జ‌రిగిన ఆ ప‌రిణామం ఏమిటో తెలుసుకుందాం.
గ‌త నెల 16న నీతి ఆయోగ్ స‌మావేశంలో పాల్గొన్న అనంత‌రం తిరిగి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సీఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల ముచ్చ‌ట ఎత్తుకున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి వంద‌కుపైగా సీట్లు వ‌స్తాయ‌ని ఆయ‌న చెప్పారు. ముంద‌స్తుకు వెళ్దామా అంటూ ప్ర‌తిప‌క్షాల‌కు స‌వాల్ విసిరిన విష‌యం విదిత‌మే.

అయితే.. గ‌త నెలాఖ‌రులో మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అదేమిటంటే.. రెండు స్థానాల‌కు పార్టీ అభ్య‌ర్థుల‌ను ఆయ‌న ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డిని, రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్‌గౌడ్‌ల‌ను అత్య‌ధిక మెజారిటీతో గెలిపించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఇక్క‌డే అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. అభ్య‌ర్థుల‌ను కేటీఆర్ ప్ర‌క‌టించ‌డంలో ఆంతర్య‌మేమిట‌న్న‌ది ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. దీంతో గులాబీ గూటిలో అప్పుడే టికెట్ల జాత‌ర మొద‌లైందని చెప్పొచ్చు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రెవ‌రికి టికెట్లు కేటాయించాలో సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు బ‌లం చేకూర్చే లా రంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించిన‌ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఉన్నాయి. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. పార్టీలో ఇప్ప‌టికే మంత్రి కేటీఆర్‌, మంత్రి హ‌రీశ్ వ‌ర్గాలు ఉన్నాయ‌నే టాక్ ఉంది. నిజానికి కొద్ది నెల‌లుగా హ‌రీశ్‌వర్గంలోని ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రుగా కేటీఆర్‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఆ ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఇక మంత్రి హ‌రీశ్‌కు చెక్ ప‌డిన‌ట్టేన‌ని పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. హరీశ్‌వ‌ర్గానికి చెందిన మిగ‌తా ఎమ్మెల్యేలు కూడా చిన్న‌గా జారుకోవ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది.