నలుపు అశుభానికి గుర్తా....ఎందుకు?  

  • నలుపును అశుభానికి గుర్తుగానే అందరు భావిస్తారు. రాముడినీ, కృష్ణుడినీ తప్ప నల్లగా ఉన్న ప్రతి ఒక్కరిని తక్కువగా చూస్తుంటారు.చర్మం దగ్గరి నుంచీ, వేసుకునే బట్టల వరకూ నలుపు రంగును చాలా మంది దూరంగా ఉంచుతారు. నిజానికి రంగులన్నీ కలిస్తే పుట్టేది నలుపు రంగే. వర్ణ శాస్త్రం ప్రకారం నలుపు అధికారాన్ని మరియు హుందా తనాన్నీ సూచిస్తుంది. విష్ణు మూర్తి అవతారాలయిన రాముడు, కృష్ణుడు మాత్రమే కాదు పురాణాలలో అత్యంత సౌందర్య వతులయిన ద్రౌపది, శకుంతల వంటి వారు కూడా నల్లని మేనిఛాయను కలిగి ఉన్నవారే.

  • అయ్యప్ప స్వామి మాల ధారణకు నలుపూ రంగునే వాడతారు. కొన్ని ప్రాంతాలలో అమ్మవారికి నల్లని చీరను ధరింపజేస్తారు. ఆలయానికి వచ్చిన స్త్రీలకు నల్లని గాజులను అమ్మవారి ప్రసాదంగా ఇస్తారు.

  • త్రిగుణాలలో ఎరుపు రాజసానికి, నీలం సాత్వికానికి ,నలుపు రంగు తామస గుణానికి ప్రతీక అని శ్రీ కృష్ణ భగవానుడే స్వయంగా భగవద్గీతలో చెప్పారు. తామసం అంటే క్రోధం. వెలుతురు జ్ఞానానికి ప్రతీక చీకటి ఆజ్ఞానానికి ప్రతీక. నలుపు రంగు చీకటికి చిహ్నం. నలుపు దుఃఖానికి, నిరసనకి ప్రతీకగా ఇప్పటికీ వాడుతున్నాము. కొన్ని ప్రాంతాలలో భర్త చనిపోయిన వారు నలుపు దుస్తులను ధరించి ఉంటారు. వారి శేష జీవితమంతా నలుపు రంగు దుస్తులనే వారు ధరిస్తారు.

  • నలుపు రంగు వేడిని తొందరగా గ్రహిస్తుంది. ప్రమాదాలను త్వరగా ఆకర్షిస్తుంది. అందుకే నలుపు రంగుని అశుభ సూచకంగా భావిస్తారు.