మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల బీజేపీ శ్రేణులతోపాటు దేశం మొత్తం విషాదంలో కూరుకుపోయింది.దేశ సేవ కోసం జీవితాన్ని అంకితం చేసిన వాజ్‌పేయి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడం కోసం అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.
అయితే ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న అంశాన్ని ఆయన ఓ సారి చెప్పారు. తనకు పెళ్లి చేసుకునే సమయం దొరకలేదన్నారు. బాధ్యత లేని జీవితాన్ని గడుపుతున్నట్లు చమత్కరించారు. 2002లో ఆయన ఓ సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కవితలతో జనాలను ఆకట్టుకుని రాజకీయాల్లో చేరినట్లు ఆయన చెప్పారు. అయిదవ తరగతి చదువుతున్నప్పుడు ఓ టీచర్ అటల్‌ను చెంపదెబ్బ కొట్టింది. అదే అతని జీవితంలో చాలా చేదు సంఘటనట. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రెసిడెంట్ శంకర్ దయాల్ శర్మ ఆహ్వానించడం.. వాజ్‌పేయి జీవితంలో థ్రిల్లింగ్ మూమెంట్. పార్లమెంట్లో బలపరీక్ష సమయంలో ఒక్క ఓటుతో ఓడినా.. ఆయన ఆ విషయం గురించి ఎన్నడూ బాధపడలేదట.
వాజ్‌పేయి గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీ (ప్రస్తుతం లక్ష్మీబాయి కాలేజీ) లో చదివే రోజుల్లో తన సహధ్యాయి రాజ్‌కుమారి కౌల్‌తో స్నేహంగా మెలిగేవారు. ఆ తర్వాత కౌల్‌కి పెళ్లయింది. అయితే కొన్నాళ్లకి ఆమె భర్త ఢిల్లీలోని ఓ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా చేరడంతో.. వారి మకాం అక్కడికి మారింది. ఢిల్లీ వచ్చాక వాజ్‌పేయి-కౌల్ల మధ్య పాత స్నేహం మళ్లీ కొనసాగింది .
కౌల్ జీవితం సాఫీగా సాగిపోతున్న దశలో ఆమ భర్త మరణించారు. అప్పటికే ఆమెకు ఆడపిల్లలు ఉన్నారు. కౌల్ ఒంటరవడం తట్టుకోలేకపోయిన వాజ్‌పేయి.. ఆమెను తన ఇంటికి ఆహ్వానించారు. అక్కడే ఉండిపొమన్నారు. ఆమె కుమార్తె నమిత భట్టాచార్యను ఆయన దత్తత కూడా తీసుకున్నారు. ఆమె 2014లో కార్డియాక్ అరెస్ట్‌తో ఎయిమ్స్‌లోనే మరణించారు.
అప్పటికే మంచానికే పరిమితమైన వాజ్‌పేయి.. కౌల్ మరణంతో మరింత కుంగిపోయారు. స్నేహితురాలైన కౌల్ బాధ్యత తీసుకోవడం, ఆమె కుమార్తెను పెంచడం మినహా.. వాజ్‌పేయి పెళ్లాడలేదనేది వాస్తవం. ఒకరి పట్ల మరొకరికి ఎంతో గౌరవం ఉండేది. వీరిద్దరే కాదు.. నమితను పెళ్లాడిన రంజన్ భట్టాచార్య కూడా వాజ్‌పేయికి సన్నిహితంగా మెలిగేవాడు. వాజ్‌పేయిని తండ్రి సమానుడిలా చూసేవాడు.