ఉత్తర ఐర్లాండ్‌లో( Northern Ireland ) ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ ఇద్దరు భారత సంతతి యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.
కౌంటీ డెర్రీలోని కేరళ కమ్యూనిటికీ చెందిన 16 ఏళ్ల రూవెన్ సైమన్, జోసెఫ్ సెబాస్టియన్‌లు( Reuven Simon, Joseph Sebastian ) గతేడాది ఆగస్టులో ఎనాగ్ లాఫ్ (ఎనాగ్ సరస్సు)లో ఈత కొడుతూ మునిగిపోయారు.స్థానిక వార్తా నివేదికల ప్రకారం.
గల్లంతైన వీరిలో ఒకరిని ఆల్ట్నా గెల్విన్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు.
రెండవ వ్యక్తి కోసం సహాయక బృందాలు డైవర్లను రంగంలోకి దింపాయి.ఈ క్రమంలో బాలుడి మృతదేహాన్ని ఎట్టకేలకు వెలికితీశారు.

మృతులిద్దరూ నార్త్ ఐర్లాండ్‌లోని డెర్రీలోని సెయింట్ కొలంబ్స్ కాలేజీ విద్యార్ధులు.ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫిన్‌బార్ మాడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన వారి అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో స్థానికులు, బంధుమిత్రులు హాజరయ్యారు.సైరో మలబార్ చర్చి ఆచారాల ప్రకారం క్రతువు నిర్వహించారు.వీరిద్దరి మరణంపై ఈ వారం విచారణ ప్రారంభమవుతున్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి.గతేడాది ఆగస్టులో వేసవిలో ఆరుగురు బాలుర బృందం ఎనాగ్ లాఫ్‌కు సైకిల్‌పై వెళ్లింది.
అనంతరం వీరంతా ఈత కొట్టడానికి సరస్సులోకి దిగారు.

జోసెఫ్ సెబాస్టియన్ తండ్రి.సెబాస్టియన్ జోస్ సరస్సు వద్ద ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌పై మరిన్ని సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.తనలాంటి కష్టం మరొకరికి కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి రూవెన్ సోదరుడు ఇవాన్ సైమన్ మాట్లాడుతూ.ఆ రోజున సరస్సులోని నీరు చాలా చల్లగా, ముదురు ఆకుపచ్చ రంగులో వుందని చెప్పాడు.
బాలురు సరస్సులోకి దిగిన పావుగంట తర్వాత ఒడ్డు నుంచి 8 మీటర్ల దూరంలో వున్న జోసెఫ్ సెబాస్టియన్ ‘‘హెల్ప్ హెల్ప్’’ అంటూ అరిచాడని తెలిపాడు.అతనికి తోటి సహచరులు సాయం చేయడానికి ప్రయత్నించారని ఇవాన్ వెల్లడించాడు.