భార్యను దారుణంగా హత్య చేసిన జిగు కుమార్ సోర్తి (23) అనే భారత సంతతి వ్యక్తిని యూకే కోర్టు దోషిగా తేల్చింది.ఈ ఏడాది మార్చిలో చోటు చేసుకున్న ఈ హత్యకు సంబంధించి లీసెస్టర్ క్రౌన్ కోర్టు సెప్టెంబర్ 16న శిక్ష విధించనుంది.మార్చి 2 మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మృతురాలు భావిని ప్రవీణ్‌తో మాట్లాడటానికి సోర్తి ఆమె ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ సోర్తి ఆమెను పలుసార్లు పొడిచి అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించారు.పోస్టుమార్టం నివేదికలో ప్రవీణ్ పదుల సంఖ్యలో కత్తిపోట్లకు గురైనట్లు తేలింది.ఈ కేసుపై డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ కెన్నీ హెన్రీ మాట్లాడుతూ.దీనిని అమాయకురాలైన యువతిపై దుర్మార్గమైన దాడిగా అభివర్ణించారు.
కేవలం 21 సంవత్సరాల చిన్న వయసులోనే అత్యంత క్రూరంగా ఆమె హత్యకు గురైందని హెన్రీ ఆవేదన వ్యక్తం చేశారు.సోర్తి దోషిగా తేలడంపై బాధితురాలి తండ్రి ప్రవీణ్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు.
తమ కుమార్తె హత్యకు గురైనప్పుడు ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు.తమ ప్రార్థనలు ఫలించి భావిని జన్మించినప్పుడు మా ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని సంతోషించామని ఆయన వెల్లడించారు.భావిని జన్మించిన తర్వాత తమకు కృతేష్, యజ్ఞేష్ పుట్టారని ప్రవీణ్ బాబు అన్నారు.బిడ్డల భవిష్యత్ కోసం తమ కుటుంబం ఇంగ్లాండ్‌కు వలస వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు.
తల్లిదండ్రులుగా తమ కుమార్తె బాగా చదివి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలనేది తమ ఆకాంక్ష అని ప్రవీణ్ బాబు అన్నారు.ఇదే సమయంలో సోర్తి తమ కూతురిని నిశ్చితార్థం చేసుకున్నప్పుడు, ఆమెను బాగా చూసుకుంటాడని విశ్వసించామని ప్రవీణ్ బాబు గుర్తుచేసుకున్నారు.
అయితే జిగు తమ కుమార్తెపై ఎలాంటి ప్రేమ చూపించలేదని ఆయన చెప్పారు.అతనికి మంచి జీవితం ఇవ్వాలనే ఉద్దేశంతో జిగును ఇంగ్లాండ్‌కు తీసుకొచ్చి అండగా నిలిచామని ప్రవీణ్ తెలిపారు.
తాము చేసిన సాయానికి జిగు తమ కుమార్తెను చంపి మా రుణం తీర్చుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.