కుటుంబాన్ని ఉన్నత స్థానంలో ఉంచాలని, పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో ఎంతోమంది పొట్టచేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వలస వెళుతుంటారు. ఏజెంట్లు మోసం చేసినా, యజమానులు చిత్ర హింసలు పెట్టినా తట్టుకుని భార్యాబిడ్డల కోసం ఎంతటి కష్టాన్నైనా భరించేవారు ఎంతోమంది.
ప్రతి నిత్యం దుబాయ్‌లో కష్టాలు పడుతున్న ఎవరో ఒక భారతీయుడి దీనగాథ మీడియాలో చూస్తూనే ఉంటాం.ఈ క్రమంలో టూరిస్ట్ వీసాపై దుబాయి వెళ్లిన ఓ భారతీయుడు అదృశ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే.తమిళనాడు రాష్ట్రానికి చెందిన అమృతలింగం సమయముత్తు (46) అనే వ్యక్తి ఉపాధి కోసం మరో నలుగురితో కలిసి ఈ నెల 8న దుబాయి చేరుకున్నాడు.
నగరంలోని హోర్ అల్ ఆంజ్ ప్రాంతంలోని ఓ హోటల్లో నలుగురు బస చేశారు.
ఆ తర్వాతి రోజు ఉదయం అమృతలింగం విధులకు హాజరై ఇంటికి తిరిగి రాగా.
మిగిలిన ముగ్గురు మిత్రులు నైట్ షిఫ్ట్‌కు వెళ్లారు.అయితే వారు తిరిగి హోటల్‌కి తిరిగి వచ్చేసరికి అమృతలింగం కనిపించలేదు.
బయటకు ఏమైనా వెళ్లాడా అని కొద్దిసేపు ఎదురుచూశారు.అయినా ఎంతసేపటికీ అతను తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చింది.
అటు అమృతలింగం ఇంటికి సైతం ఫోను చేయకపోవడంతో.ఈ ముగ్గురికి ఆయన కుటుంబ సభ్యులు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు.
ఆ ముగ్గురిలోని ఓ వ్యక్తి బంధువు దుబాయిలోనే నివసిస్తుండటంతో.అతడి ద్వారా నవంబర్ 16న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు అమృతలింగం పనిచేస్తున్న కంపెనీకి వెళ్లగా.అతడి పాస్‌పోర్టు, వస్తువులు అక్కడే వదిలేసి వెళ్లినట్టు గుర్తించారు.అదృశ్యమై రెండు వారాలైనా అమృతలింగం ఆచూకీ దొరకకపోవడంతో.అతడి కుటుంబం సోషల్ మీడియా ద్వారా దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్‌ను సంప్రదించింది.
విషయం తెలుసుకున్న కాన్సులేట్ అధికారులు అమృతలింగంను వెతికే పనిలో పడ్డారు.ఈ ఉదంతంతో విజిట్ లేదా టూరిస్ట్ వీసాపై ఉద్యోగం చేసేందుకు దుబాయి రావొద్దంటూ కాన్సులేట్ ఈ సందర్భంగా హెచ్చరించింది.
దుబాయిలో ఉద్యోగం చేయాలంటే దానికి తగిన వీసాతో మాత్రమే దేశంలోకి రావాల్సి ఉంటుందని, విజిట్ లేదా టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయడం నేరమని కాన్సులేట్ అధికారులు హెచ్చరించారు.