ముందస్తు .. ఉండొచ్చు ! సిద్ధమవుతోన్న పార్టీలు !     2018-06-13   03:09:50  IST  Bhanu C

దేశంలోనే కాదు ఏపీలోనూ రాజకీయ పరిణామాలు చక చక మారిపోతున్నాయి.ఇప్పడు పార్టీల హడావుడి చూస్తుంటే.. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే పార్టీలన్నీ ముందే జాగ్రత్త పడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకే పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ కారణంగానే… టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలకు సూచనలు పంపారు.

అంతే కాదు.. వచ్చే ఆరు నెలలకు కార్యాచరణ కూడా ప్రకటించారు. ఆగస్టు పార్లమెంట్ సమావేశాల్లో అన్ని విపక్ష పార్టీలో ఢిల్లీలో భారీ ఆందోళనకు చంద్రబాబు ప్లాన్ చేశారు. ఇప్పుడు దీన్ని ముందుకు జరిపారు. అన్ని పార్టీల ఎంపీలతో. ఈ నెల చివరిలోనే ఢిల్లీలో సభ నిర్వహించాలని ఆదేశించారు. ముందస్తు సూచనలతో మారిన వ్యూహమే దీనికి కారణం అని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఏడాది చివరిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీపై తీవ్ర స్థాయిలో అధికార వ్యతిరేకత ఉంది. ఎక్కడా గెలిచే అవకాశం లేదని ఇప్పటికే బీజేపీ వర్గాలు కూడా ఓ అంచనాకు వచ్చాయి. అందుకే ముందస్తుకు వెళ్లడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఢిల్లీలో జోరుగా వినిపిస్తోంది. ఆ మూడు రాష్ట్రాలతో పాటే.. పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని బీజేపీ కీలక నేతలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.