అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు శుక్రవారం అక్కడి అగ్రశ్రేణి 10 యూనివర్సిటీల అధిపతులతో భేటీ అయ్యారు.జ్ఞానం, సమాచార మార్పిడిలు భారత్- అమెరికా సంబంధాలలో అంతర్భాగమన్నారు.
ఇరు దేశాలకు సంబంధించి విద్య, సాంకేతికతలను బలోపేతం చేయడం ప్రధానమైనదన్నారు.భారత రాయబార కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కొందరు వ్యక్తిగతంగా హాజరవ్వగా.
మరికొందరు వర్చువల్‌గా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తరంజిత్ సింగ్ మాట్లాడుతూ.
ఇరు దేశాల మధ్య విజ్ఞాన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, విద్యాశాఖ మంత్రి ఆసక్తిగా వున్నారని సంధూ అన్నారు.
అమెరికాలో మీ విజయాలను చూసి గర్విస్తున్నామన్న తరంజిత్ .భవిష్యత్‌లో కూడా మరిన్ని విజయాలను సాధించాల్సిందిగా ఆకాంక్షించారు.రెండు దేశాలలోని యువత ఒకరికొకరు ఎంత సన్నిహితంగా వుంటారనే దానిపై భారత్ – అమెరికా సంబంధాల భవిష్యత్తు ఆధారపడి వుంటుందని అన్నారు.
ఇరు దేశాల మధ్య విద్యా సంబంధాలు మెరుగుపరచాలని భావిస్తున్న తరంజిత్ సింగ్ సంధు ఇటీవలి కాలంలో జార్జియా టెక్, ఎమోరీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలను సందర్శించిన సంగతి తెలిసిందే.
ఇక తాజా సమావేశానికి హాజరైన వారిలో సతీష్ కె త్రిపాఠి, స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, బఫెలో; ప్రదీప్ ఖోస్లా (యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో); మైఖేల్ రావు (వర్జీనియా కామన్వెల్త్ విశ్వవిద్యాలయం), ప్రొఫెసర్ కుంబ్లే సుబ్బస్వామి (మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం, అమ్హెర్స్ట్); ఆశిష్ వైద్య (నార్త్ కెంటుకీ విశ్వవిద్యాలయం), రేణు ఖాటర్ (యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్), వెంకట్ రెడ్డి (యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో, కొలరాడో స్ప్రింగ్స్), మౌలి అగర్వాల్ (యూనివర్సిటీ ఆఫ్ మిస్సౌరీ, కాన్సాస్ సిటీ), మంతోష్ దివాన్ (అప్‌స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, సునీ) మరియు మహేశ్ దాస్ (బోస్టన్ ఆర్కిటెక్చరల్ కాలేజ్, బోస్టన్) వున్నారు.
ప్రస్తుతం దేశంలోని 16 విశ్వవిద్యాలయాలకు అధ్యక్షులుగా భారత సంతతి వ్యక్తులే వున్నారు.