వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులు.స్వదేశానికి ఎన్నో రకాలుగా లాభాలను చేకూరుస్తున్నారు.
వీరి వల్ల పెద్ద సంఖ్యలో విదేశీ మారక ద్రవ్యం భారతదేశ ఖజానాకు జమ అవుతోంది.దీనికి తోడు పలు సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ప్రభుత్వాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.
స్వదేశంలో పెట్టుబడులు పెట్టి.ఎంతో మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.
ఇక కోవిడ్ సమయంలో ఎన్ఆర్ఐలు చేసిన సాయాన్ని ఈ దేశం మరిచిపోదు.ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, మందులు, వైద్య పరికరాలతో పాటు లక్షల డాలర్ల విరాళాలను ఎన్ఆర్ఐలు ఇండియాకు అందించారు.
అలాగే ఆయా దేశాల్లోని రాజకీయ, వ్యాపారాలతో పాటు ఇతర కీలక రంగాల్లో అత్యున్నత స్థానాల్లో వుండటంతో ఆ దేశాలు భారత్‌తో సన్నిహిత సంబంధాలు బలపడటంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఉదాహరణకు అమెరికాలోని చట్టసభల్లో ఇతర ఉన్నత పదవుల్లో వున్న భారత సంతతి ప్రముఖులు కోవిడ్ సెకండ్ వేవ్‌లో అమెరికా అధినాయకత్వంపై ఒత్తిడి తెచ్చి బైడెన్ మనసు మార్చారు.
వీరి చొరవతోనే అమెరికా అధ్యక్షుడు భారత్‌కు భారీగా సాయాన్ని ప్రకటించారు.అది నేటికి కొనసాగుతుండటం విశేషం.ఒక్క అమెరికాయే కాదు.బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లోనూ భారతీయులు బలమైన లాబీయింగ్ వ్యవస్థగా మారిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో హిందూ మహా సముద్రంలో తన కార్యకలాపాలను పెంచడంతో పాటు చైనాకు ధీటుగా సముద్ర వాణిజ్యంలో భారత్ పై చేయి సాధించాలంటే ఆఫ్రికా ఖండంలో పెద్ద సంఖ్యలో స్థిరపడ్డ భారత సంతతిపై ఢిల్లీ దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.ఆఫ్రికాలో పెద్ద సంఖ్యలో స్థిరపడిన భారత సంతతి ప్రజలు చీకటి ఖండంతో సంబంధాలను తిరిగి పునరుద్దరించడంలో కీలక పాత్ర పోషించగలరని వారు అభిప్రాయపడుతున్నారు.నరేంద్రమోడీ ప్రభుత్వం ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చర్యలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు.

2015లో టాంజానియా మాజీ అధ్యక్షుడు జకాయ కిక్వేటే న్యూఢిల్లీలో ఐదు రోజులు పర్యటించిన తర్వాత భారత్‌తో సంబంధాలు ఊపందుకున్నాయన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.అయితే ఆ తర్వాత సంబంధాలు కాస్త నెమ్మదించాయని చెబుతున్నారు.గత నెలలో హైదరాబాద్‌లో టాంజానియా తన కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది.
హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని వున్న ఆ దేశంలో అపారమైన సహజవాయువు నిల్వలు వున్నట్లుగా మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనలైజెస్ ఒక నివేదికలో పేర్కొంది.ఇదే సమయంలో టాంజానియాతో సరిహద్దును పంచుకునే కెన్యాలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవల పర్యటించారు.కోవిడ్ 19 వల్ల భారత్- ఆఫ్రికా దేశాల మధ్య సంబంధాలు స్వల్పంగా క్షీణించినప్పటికీ మనదేశం ఆఫ్రికా ప్రాముఖ్యతను మరోసారి పునరుద్ఘాటించింది.
ఆఫ్రికా దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఆ ఖండంలో స్థిరపడ్డ భారత సంతతిని ఉపయోగించుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.ఇందుకోసం ఎన్ఆర్ఐలతో ఢిల్లీ నిరంతరం సంప్రదింపులు జరుపటంతో పాటు వారికి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచిస్తున్నారు.