తాజాగా చైనాలోని హంగ్ జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో(Asian Games ) శ్రీలంక ను చిత్తుగా ఓడించి బంగారు పతకాన్ని గెలిచింది భారత మహిళల క్రికెట్ జట్టు.తాజాగా ఏషియన్ గేమ్స్ ఉమెన్స్ టీ20 2023 ఫైనల్ మ్యాచ్ భారత్- శ్రీలంక మధ్య జరిగింది.
హర్మన్ ప్రీత్ సింగ్ ( Harmanpreet Kaur )ఆధ్వర్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకపై 19 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.భారత బ్యాటర్లైన స్మృతి మందాన ( Smriti Mandhana )46, జెమీయా రోడ్రిగ్స్ 42 పరుగులతో రాణించారు.
అనంతరం 117 పరుగుల లక్ష్య చేదనకు దిగిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసి 19 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.భారత జట్టు బౌలర్ టిటాస్ సాధు( Titas Sadhu ) మూడు వికెట్లు తీసి శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేసింది.దీంతో శ్రీలంక జట్టు పరుగులు చేయడంలో తడబడింది.
భారత పురుషుల క్రికెట్ జట్టు ఆసియా కప్ 2023 టోర్నీలో ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకను 50 పరుగులకే ఆల్ అవుట్ చేసి పది వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.తాజాగా భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా క్రీడల ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకను ఓడించి బంగారు పతకం గెలిచింది.
ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించడంతో భారత మహిళల జట్టుపై కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బీసీసీఐ సెక్రటరీ జైషా( Jay Shah ) లతోపాటు ప్రముఖ క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.