ఎన్టీఆర్‌ లో మహానటి ఉంటే..!       2018-06-26   03:54:35  IST  Raghu V

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌ల జోరు కొనసాగుతుంది. వరుసగా బయోపిక్‌లు తెరకెక్కుతున్న నేపథ్యంలో బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘ఎన్టీఆర్‌’ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభించబోతున్నారు. అనుకున్న స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు క్రిష్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి బాలీవుడ్‌ రేంజ్‌లో గుర్తింపు తీసుకు వచ్చేందుకు దర్శకుడు క్రిష్‌ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ను ఈ చిత్రంలో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేశాడు. ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రను విద్యాబాలన్‌తో చేయించాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. విద్యాబాలన్‌ ఈ చిత్రంలో నటిస్తే ఖచ్చితంగా సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అయ్యింది. కాని సౌత్‌ చిత్రాల్లో నటించే ఆసక్తి తనకు లేదు అని, సౌత్‌లో తాను నటించాలని కోరుకోవడం లేదు అంటూ క్రిష్‌కు సున్నితంగా నో చెప్పింది.

విద్యాబాలన్‌ నో చెప్పడంతో చేసేది లేక సౌత్‌ హీరోయిన్స్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే ‘మహానటి’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్న కీర్తి సురేష్‌ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణతో నటించేందుకు కీర్తి సురేష్‌ మొదట నో చెప్పినప్పటికి సినిమా ప్రాముఖ్యత మరియు ఇతరత్ర విషయాల నేపథ్యంలో చివరకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. కీర్తి సురేష్‌ బసవతారకం పాత్రలో నటిస్తే ఖచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

‘మహానటి’ చిత్రంలో నటించి అద్బుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. సావిత్రిని దించేసిన కీర్తి సురేష్‌ ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో బసవతారకంను దించేయనున్నారు అంటూ భావిస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిష్‌ రెండు పార్ట్‌లుగా తెరకెక్కించబోతున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికి, అవి పుకార్లే అని చిత్ర యూనిట్‌ సభ్యులు తేల్చి పారేశారు. 2019 సంక్రాంతికి సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.

,