ఇలియానాకు అంత ఇవ్వడం ఏంటీ?       2018-05-23   22:07:51  IST  Raghu V

తెలుగు సినిమా పరిశ్రమ నిర్మాణ వ్యయం భారీగా పెరిగి పోతుంది. అందుకు ముఖ్య కారణం పారితోషికా లు భారీగా పెంచేయడేమ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్‌ హీరోలతో, పెద్ద దర్శకులతో సినిమాలు చేయాలి అంటే బడ్జెట్‌లో దాదాపు సంగం పారితోషికంకే కేటాయించాల్సి వస్తుంది. ఈ విషయంలో హీరోయిన్స్‌ కాస్త పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్‌తో పోల్చితే తెలుగులో స్టార్‌ హీరోయిన్స్‌ పారితోషికం చాలా తక్కువ ఉంటుంది. హీరోల రేంజ్‌లో హిందీ హీరోయిన్స్‌ పారితోషికం తీసుకుంటారు. కాని తెలుగు హీరోయిన్స్‌ కోటి, కోటిన్నరకు మించి తీసుకునే అవకాశం లేదు.

స్టార్‌ హీరోయిన్‌ అయినా, తోపు హీరోయిన్‌ అయినా అది సూపర్‌ స్టార్‌ సినిమా అయినా, మరే సినిమా అయినా కూడా హీరోయిన్స్‌కు పారితోషికం లిమిటెడ్‌గానే ఉంటాయి. భారీ చిత్రాల్లో నటిస్తే హీరోయిన్స్‌ రెండు కోట్ల వరకు తీసుకుంటారు. మీడియం బడ్జెట్‌ చిత్రాలు అంటే 25 నుండి 30 కోట్ల లోపు బడ్జెట్‌ చిత్రాల్లో హీరోయిన్స్‌కు 1.5 కోట్ల వరకు ఖర్చు చేస్తారు. అంతకు మించి ఖర్చు చేస్తే బడ్జెట్‌ శృతిమించడం ఖాయం అనే విషయం అందరు గుర్తిస్తున్నారు. అయితే కొందరు దర్శకులు మాత్రం తమ స్థాయి, సినిమాలో హీరో స్థాయిని గుర్తించకుండా బడ్జెట్‌ను భారీగా ఖర్చు చేస్తూ ఉంటారు. తాజాగా శ్రీనువైట్ల అలాగే చేస్తున్నాడు.

ఈయన వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. అయినా కూడా రవితేజ ఈయనకు అవకాశం ఇచ్చాడు. ఒక మీడియం బడ్జెట్‌ చిత్రంగా రవితేజతో శ్రీనువైట్ల ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఆ చిత్రం అనుకున్న బడ్జెట్‌కు డబుల్‌ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అను ఎమాన్యూల్‌ తప్పుకోవడంతో ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇలియానాను ఎంపిక చేయడం జరిగింది. బాలీవుడ్‌లో అవకాశాలు లేక పెళ్లి చేసుకుని సెటిల్‌ అయ్యిన ఇలియానాను ఇందులో తీసుకోవడం మంచి నిర్ణయం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలియానాకు రెండు కోట్ల పారితోషికం ఇచ్చారంటూ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

తెలుగు ప్రేక్షకులు మర్చి పోయిన ఇలియానాకు రెండు కోట్ల పారితోషికం ఇవ్వడం ఏంటని శ్రీనువైట్లపై సినీ వర్గాల వారు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలియానా పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌ బై చెప్పాలనుకుంది. కాని శ్రీనువైట్ల ఏరి కోరి మరీ ఆమెను తీసుకు వచ్చాడు. సరే తీసుకు వచ్చాడు, కాని అంత పారితోషికం ఇవ్వడం ఏంటీ బాసూ అంటూ ఆయన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇలియానా ప్రస్తుతం స్టార్‌ కాదు. ఆమె ఉండటం వల్ల సినిమా క్రేజ్‌ పెరగదు. అందువల్ల ఆమెకు ఇచ్చే రెండు కోట్లు వృదా ఖర్చు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇదే సినిమాలో శృతిహాసన్‌ కూడా నటిస్తుంది. ఆమెకు కూడా భారీ పారితోషికాన్ని ఇస్తున్నారు. ఇలా హీరోయిన్స్‌ పారితోషికంతో సినిమా బడ్జెట్‌ను శ్రీనువైట్ల పెంచేస్తున్నాడు. చివరకు ఏం జరుగుతుందో అని నిర్మాతలు కాస్త ఆందోళనగా ఉన్నారు.