కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రసిద్ధి చెందినదో అందరికీ తెలిసినదే.ఈ ఆలయం తర్వాత అంతటి ప్రసిద్ధి గాంచినది శ్రీనివాసమంగాపురం ఆలయం ఒకటి.
ఈ ఆలయంలో స్వామి వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తున్నారు.పురాణాల కథనం ప్రకారం సాక్షాత్తూ స్వామి వారు వివాహం అనంతరం అమ్మవారితో కలిసి ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ ప్రాంతానికి శ్రీనివాసమంగాపురం అనే పేరు వచ్చింది.
ఈ ఆలయం 16వ శతాబ్ద కాలంలోనే నిర్మించబడినదని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.
ఎంతోమందికి జాతక దోషం ఉండటం వల్ల వివాహంలో అడ్డంకులు ఏర్పడుతుంటాయి.
అలాంటి వారు వారి తల్లిదండ్రులతో వచ్చి ఇక్కడ స్వామివారి కల్యాణోత్సవం జరిపించడం విశేషం.కల్యాణం అనంతరం అర్చకులు ఇచ్చేటటువంటి కంకణం చేతికి ధరించిన వారికి తొందరగా కళ్యాణం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
అందుకోసమే ఎక్కువగా అవివాహితులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం శ్రీనివాసుడి వివాహం నారాయణవనంలో జరిగిన తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతుడై తిరుమల కొండకు బయలుదేరుతాడు.అయితే శాస్త్ర ప్రకారం పెళ్లయిన దంపతులు ఆరు నెలల వరకు కొండ ఎక్కకూడదు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదు అని అగస్త్య మహర్షి చెప్పడంతో స్వామి వారు సతీసమేతంగా అగస్త్య ఆశ్రమంలోనే ఆరునెలలపాటు విడిది చేస్తారు.స్వామి వారు ఇక్కడే ఎక్కువ కాలం విడిది చేసి తిరుమలకు వెళ్లే ముందు భక్తులకు రెండు వరాలను ప్రసాదించి వెళ్లారు.
తన దర్శనార్థం తిరుమలకు రాలేని భక్తులు శ్రీనివాసమంగాపురంలోని దర్శనం చేసుకోవచ్చని, పద్మావతి దేవిని పరిణయమాడిన వెంటనే శ్రీనివాసమంగాపురంలో విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి సకల సౌఖ్యాలు, పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని కల్పించినట్లు పురాణాలు చెబుతున్నాయి.కాబట్టి వివాహం కాని వారు శ్రీనివాసమంగాపురంలోని స్వామివారిని దర్శించుకున్న వారికి వివాహం అవుతుందని భక్తులు విశ్వసిస్తారు.